ధర్మారం,మార్చి 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలోని వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. సుమారు 150 ఎకరాలలో వరి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతులు సుమారు 300 ఎకరాలతో యాసంగి సీజన్ లో వరి పొలాలు సాగు చేశారు. వరి నాట్లు వేసిన సమయంలో వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు మెరుగ్గా ఉండడంతో రైతులు వరి సాగు చేశారు. రాను రాను ఎండల తాకిడితో వ్యవసాయ బావుల్లోని భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో కొందరు రైతులు క్రేన్ ల ద్వారా వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పూడిక తీయించినా ఊటలు రావడం లేదు.
కొంతమంది రైతులు పొలాలను కాపాడుకోవడానికి లక్షలు వెచ్చించి పూడిక తీస్తున్నారు. అయినా బావిలో చుక్కనీరు కనబడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కళ్లముందే పంటలు ఎండిపోవడంతో వాటిలో గొర్రెలు పశువులు మేతకు మేపుతున్నారు.ప్రభుత్వం ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా తమ గ్రామానికి సాగు నీటిని అందించడానికి నిర్మించ తలపెట్టిన ఎస్సారెస్పీ ఉపకాలువ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని దాని నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.