UGD Works | కోల్ సిటీ, ఏప్రిల్ 1: రామగుండం కార్పొరేషన్ లో సీడీఎంఏ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్ నిధులను కాజేసే కుట్ర జరుగుతుందని.. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రూ.13.70 కోట్ల నిధులతో జేబులు నింపుకునేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ నిధులు బయటకు వెళ్లకుండా వెంటనే శాఖపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాడు హైదరాబాద్‌లోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగుండం కార్పొరేషన్ లో ఇటీవల 7 ప్యాకేజీలతో యూజీడీ పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లతో లెస్ పర్సంటేజీకి టెండర్లు ఖరారు చేయించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్ నిధులు రూ.13.70 కోట్ల తో యూజీడి పనులు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని, ఈ విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పైగా కాంట్రాక్టర్లు రింగుగా మారి నాసిరకం పనులు చేపడుతున్నారని, పీఆర్సీ పైపులకు మట్టి పైపులు వినియోగిస్తున్నారని, ఇప్పటికే పలుచోట్ల యూజీడి లీకేజీలు జరుగుతున్నాయని, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి ఎలాగైనా బిల్లులు పొందాలని కాంట్రాక్టర్లు శరవేగంగా నాసిరకం పనులు చేపడుతున్నారని, విచారణ భయంతో ముందుగానే బిల్లులు పొందేందుకు అధికారులకు కమిషన్ల ఆశ చూపిస్తున్నారని ఆరోపించారు.
టెండర్ల అవకతవకలపై విచారణ జరుగుతుండగానే బిల్లులు పొందేందుకు కాంట్రాక్టర్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి నిధులు దుర్వినియోగం కాకుండా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లకు భవిష్యత్తులో టెండర్లలో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. టెండర్ల ప్రక్రియ నుంచి మొదలు జరుగుతున్న యూజీడి పనులను క్షేత్రస్థాయిలో విచారణకు మరోసారి ఆదేశించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ సూర్య తెలిపారు.