గోదావరిఖని : రామగుండం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. శుక్రవారం నాడు ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కుటుంబ సభ్యులు ఎంపీ వంశీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ లను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన క్రమంలో శనివారంఎమ్మెల్యే వివేక్ వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పి.మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్లు మాట్లాడారు.
ఐఎన్టీయూసీ సింగరేణి విభాగం నాయకుడు జనక్ ప్రసాద్ ప్రోద్బలం వల్లే ఐఎన్టీయూసీ నాయకులు వివేక్ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వివేక్ ఎప్పుడు మాట్లాడలేదని మాలలకు న్యాయం జరగాలని మాత్రమే ఆయన మాట్లాడారని దీనిని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ ఎప్పుడు కూడా మంత్రి శ్రీధర్ బాబు పై ఎలాంటి ఆరోపణలు చేయలేదని ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు తప్ప మరొకటి లేదన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు వద్ద మెప్పు పొందడానికి ఐఎన్టియుసి నాయకుడు జనక్ ప్రసాద్ ఆరాటపడుతూ ఐఎన్టియుసి నాయకులను రెచ్చగొడుతూ వివేక్ కుటుంబంపై విమర్శలు చేయిస్తున్నాడని వారు ఆరోపించారు. ఐఎన్టీయూసీ యూనియన్ నుంచి వెంకట్రావు వెళ్లిపోయిన క్రమంలో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కు గుర్తింపు కల్పించేందుకు వివేక్ వెంకటస్వామి కృషి చేశారని ఈ విషయం మరిచిపోయి జనక్ ప్రసాద్ మాట్లాడుతున్నాడని వారు విమర్శించారు.
వివేక్ ఫ్యామిలీపై ఇకనుంచి ఎవరు విమర్శలు చేసిన వారికి తగిన గుణపాఠం చెప్తామని నాయకులు స్పష్టం చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం అయినా ఐఎన్టీయూసీ మధ్య విభేదాలు రచ్చకెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడుకోవడం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆసక్తికరంగా మారింది.