కోల్సిటీ, అక్టోబర్ 7: రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఎస్సీ మాదిగ, కుల వివక్షతతో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సహచర మంత్రి అన్న విజ్ఞత లేకుండా ప్రజల్లో ఉన్నామని ఆలోచన లేకుండా ఎస్సీ మాదిగ సామాజిక వర్గంకు చెందిన మంత్రి అడ్లూరిని దూషించడం పట్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మైస రాజేష్ తీవ్రంగా ఖండించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఐఏఎస్ అధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తక్షణమే సుమోటాగా స్వీకరించి అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిలకు కూడా కమిషన్ పక్షాన దృష్టికి తీసుకవెళ్లాలని ఆ వినతిలో కోరినట్లు తెలిపారు.