పెద్దపల్లి, అక్టోబర్7 : పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. మంగళవారం పెద్దపల్లి ఎంసీహెచ్‌ను కలెక్టర్ సందర్శించారు. సెప్టెంబర్ మాసంలో పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రికార్డు స్థాయిలో 250 ప్రసూతులు నిర్వహించినందుకు గానూ, అన్ని విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రీధర్, డీఎంహెచ్‌వో డాక్టర్ వాణి శ్రీ ఆర్ఎంవో డాక్టర్ విజయ్ కుమార్‌తో పాటు వైద్య సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడీయాట్రిక్స్, గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు, గొంతు, డెంటల్, స్కిన్, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.