పెద్దపల్లి, అక్టోబర్29: పల్లెల్లో పారిశుధ్య నిర్వాహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల్లో అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లో పల్లెల్లో పారిశుధ్యంపై పంచాయతీ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో నవంబర్ 3 -11వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పరిసరాలలో చిన్న చిన్న పాలిథిన్ కవర్ కనబడకూదని స్పష్టం చేశారు.
ఖాళీ స్థలాల్లో, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పిచ్చి మొక్కలు, పోదలను పూర్తి స్థాయిలో తొలగించాలని, కాల్వల పక్కన ఉన్న చెత్త శుభ్రం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ భవనం, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలలో స్పష్టమైన మార్పు కనిపించేలాగా పారిశుధ్య నిర్వహణ ఉండాలని ఆదేశించారు. నవంబర్ 7 నాటికి కనీసం నిర్దేశించుకున్న లక్ష్యంలో 60శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో వీర బుచ్చయ్య, ఎంపీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.