గోదావరిఖని : మన దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం(Mining sector) పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ‘ఖనిజ అన్వేషణ- ఆత్మనిర్భర్ వికసిత భారత్ – 2047 వైపు ముందడుగు’ అన్న అంశంపై హైదరాబాద్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మైనింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా ఈ రంగంపై దృష్టిసారిస్తోందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో బొగ్గు, ఇనుము, తదితర ఖనిజాన్వేషణ పెద్ద ఎత్తున సాగుతోందని, రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అక్రమ మైనింగ్‌ను నిరోధించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడవచ్చన్నారు. ఈ సదస్సులో ఎన్ఎండీసీ డైరెక్టర్(కమర్షియల్) వి.సురేశ్, డైరెక్టర్ (టెక్నికల్), ఎంఈఏఐ హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్ వినయ్ కుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.విశ్వనాథ్, సలహాదారు ఎ.కె.శుక్లా, విశ్రాంత డైరెక్టర్ సత్పతి, ఎన్ ఎల్ సీ విశ్రాంత సీఎండీ సురేంద్ర మోహన్, సింగరేణి జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, ఎంఈఏఐ సభ్యులు, మైనింగ్ రంగ నిపుణులు పాల్గొన్నారు.