పెద్దపల్లి : ఎన్నికల సమయంలో వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబుపై చీటింగ్ కేసులు (Cheating Cases) నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్లెల్లో బెల్ట్‌షాపులు ( Belt Shops) అరికడతామని ప్రజలను నమ్మబలికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై (Sridharbabu) కేసు నమోదు చేయాలని కోరారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanthreddy), సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సంతకాలతో గ్యారంటీ కార్డులు ఇంటింటికీ పంపిణీ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 365 రోజులు దాటినా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు.
మంథని నియోజకవర్గంలో బెల్ట్ షాపులతో యువత తాగుబోతులుగా మారుతున్నారని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను మూయిస్తానని నమ్మించి నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా, బెల్ట్ షాపులను మూసేయకుండా మంథని ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరారు.