ధర్మారం, ఆగస్టు 12: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్వీనాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు చలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్తారనే ఉద్దేశంతో బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు దేవి వంశీకృష్ణతో పాటు సల్వాజీ మాధవ్ రావు, ఎండీ ఆజాం బాబా, చిదుగు సంపత్ తదితరులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు దేవి వంశీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఇంకెంత కాలం నిరుద్యోగులను మోసం చేస్తారని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసి గద్దెనెక్కి నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. రెండు సంవత్సరాల కాలం గడిచిన ఇప్పటివరకు ఉద్యోగ భర్తీ ప్రకటనలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని ఆయన విమర్శించారు. రానున్న కాలంలో నిరుద్యోగులంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదని వంశీకృష్ణ పేర్కొన్నారు.