కోల్ సిటీ, జనవరి 23 : ఎన్నికల కోడ్ రాకముందే రామగుండం(Ramagundam) నగరపాలక సంస్థ అత్యుత్సాహం ఆందోళనలకు దారితీస్తుంది. నగరపాలక పరిధి 54 వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి(BRS) చెందిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది ఎలాంటి నోటీసులు లేకుండానే తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐ.సత్యం డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీధులలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది హఠాత్తుగా వచ్చి పైనుంచి ఆదేశాలు వచ్చాయి అంటూ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించి తీసుకువెళ్లారు.
ఈ సంఘటనపై డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నల్లో మున్సిపల్ సిబ్బంది పని చేయడం శోచనీయమన్నారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంట అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఉండగా వాటిని మినహాయించి ప్రతిపక్ష పార్టీకి చెందిన గల్లీలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ప్రజలంతా గమనించాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి ఐ. సత్యం పేర్కొన్నారు.