గోదావరిఖని, కోల్బెల్ట్ : రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బెదిరింపులతో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సామరస్య పద్ధతిలో గెలుపు సాధించలేమని భావిస్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల స్వతంత్ర అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడం, ప్రలోభాలతో ఎలాగైనా తప్పించేందుకు కుయుక్తులతో ముందుకు సాగుతోంది. కార్పొరేషన్ లోని 35 వ వార్డులో బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన సత్యవతి అనే మహిళా నామినేషన్ స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించేలా మున్సిపల్ అధికారులు పనిచేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో అధికార పార్టీ ఒత్తిడితో సత్యవతి నామినేషన్ ను స్వతంత్ర అభ్యర్థిగాని పరిగణిస్తూ పేర్కొనడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నామినేషన్ల స్వీకరణ సందర్భంలో సత్యవతి తాను బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, పేపర్లో మాత్రం ఆమె స్వతంత్రంగానే పోటీలో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సత్యవతికి బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేయించింది. ఇదిలా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన మడిపల్లి మల్లేష్ సతీమణి విజయ తమను బెదిరింపులకు గురి చేస్తోందని బీజేపీ అభ్యర్థి రమా బిస్వాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్లో సీపీకి ఫిర్యాదు చేశారు. పోటీలో ఉంటే చంపుతామని ఆమె తనను భయపెడుతోందని.. మున్సిపల్ ఆఫీస్కు తీసుకువెళ్లి తనతో కొన్ని పేపర్లపై సంతకాలు చేయించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకటో డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో నిలిచినా.. అనేక రకాలుగా వేధించి విత్ డ్రా చేయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివిధ డివిజన్లలో సైతం కాంగ్రెస్ నాయకులు ఇలానే బెదిరింపులకు గురి చేస్తూ, ప్రలోభాలను చూపిస్తూ పుర బరి నుంచి వైదొలిగేలా చేస్తున్నారు. నామినేషన్ల విత్ డ్రాకు ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకు సమయం ఉండడంతో నయానో భయానో తమకు అనుకూలమైన చోట అభ్యర్థులను బెదిరించి, తప్పించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వేధింపులు తట్టుకోలేక చాలామంది అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం. పోలీస్ బలం, అధికార బలం కలగలిపి రామగుండం మేయర్ సీటు సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు సాగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ.. మంచి వాతావరణంలో ఎన్నికలు జరగడానికి కృషి చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కోరుతున్నారు.