Peddapalli : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి(Sai Eshawra Chari) మృతి పట్ల బీసీ కులాల నాయకులు సంతాపం తెలిపారు. బీసీల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారికి నివాళిగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథని పట్టణంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. కనగర్తి గ్రామంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బీసీ కుల సంఘాలు ఈశ్వరాచారికి నివాళులు అర్పించాయి.
శుక్రవారం సాయంత్రం బీసీస కుల సంఘాలు, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన నాయకులు సాయి ఈశ్వరాచారి మృతి పట్ల సంతాపం తెలిపారు. కొవ్వొత్తులతో అతడికి నివాళులు అర్పించిన నాయకులు బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకోవాలి తప్ప.. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బరిగీసి కొట్లాడాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ కల్పించలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకుని సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యకు పాల్పడడం విచారకరమన్నారు. ఈశ్వర్ చారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.