పెద్దపల్లి , డిసెంబర్ 24: కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు బంధు కోసం 2023 జనవరి 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సూచించారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు సాయం ఈనెల 28 నుంచి పంపిణీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 20 డిసెంబర్ 2022 కటాఫ్ తేదీగా నిర్ణయించి అప్పటి వరకు పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు, ధరణి లో డిజిటల్ సంతకం పూర్తయిన రైతులు, గిరిజన శాఖ ద్వారా పట్టాలు పొందిన రైతులకు సైతం రైతు బంధు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో యాసంగి సీజన్ కోసం ఇప్పటి వరకు 1,50,460 మంది రైతులను రూ.138,52,88,81 రైతుబంధు సాయం అందించేందుకు ఎంపిక చేశామన్నారు.
గత వాన కాలం సమయంలో 1,41,265 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. ప్రస్తుత సీజన్ లో 4360 మంది కొత్త పట్టాదారులకు అదనంగా సాయం అందిస్తున్నామన్నారు. 2022 డిసెంబర్ 20 నాటికి ధరణి, గిరిజన శాఖలో పట్టాదారులైన రైతులు రైతుబంధు పొందేందుకు తమ భూమి పట్టా, బ్యాంకు ఖాతా వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందించాలన్నారు. గత పంట కాలంలో రైతుబంధు జమ చేయబడిన రైతులు వారి బ్యాంకు ఖాతాలను ఏ కారణాల చేతనైన మార్చుకోవాలి అనుకుంటే సదరు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్‌లతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని 2023 జనవరి 7వ తేదీ లోగా సంప్రదించాలన్నారు. జిల్లాలోని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.