సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 05: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లిలో సీతారామ చంద్ర స్వామి కల్యాణం (Seeta Ramula Kalyanam) కన్నులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రామయ్య పెండ్లి వేడుకను వైభవంగా జరుపుతారు. ఈ వేడుకను కన్నులారా చూసేందుకు గ్రామం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో సీతారాముల వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల లైట్లలో ఆలయాన్ని అలంకరించారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు వేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రామాంజనేయ భజన మండలి భూపతి పూర్ బృందంచే శ్రీ సీతారామ చంద్రస్వామి చిరుతల రామాయణం ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్ కోరారు.