ధర్మారం, ఫిబ్రవరి 25 : ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా తీసుకురాని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కరీంనగర్, మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఏమి చేశారని, ప్రజలకు, పట్టభద్రులకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల పీఎం నరేంద్ర మోదీ కక్షపూరితంగా వ్యవహరించి ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన పీఎం నరేంద్ర మోదీ మోసం చేశారని ఆరోపించారు.
నిరుద్యోగులకు అన్యాయం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఓట్లు అడుతారని ప్రశ్నించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, బిజెపి కేంద్ర మంత్రుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ రూప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆశోద అజయ్, పాల్గొన్నారు.