Ramagundam Airport | పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్పోర్టు కల నిజం దిశగా ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు కోసం రూ.40.53 లక్షలు మంజూరు చేసి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించింది. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇది రామగుండం ఎయిర్పోర్టు స్థాపనకు ఒక చారిత్రాత్మక ముందడుగు అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
పెద్దపల్లి జిల్లా అనంతరం మండలంలోని 591 ఎకరాల భూమిపై గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై ఈ స్టడీ జరగనుందని గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం ఎయిర్పోర్టు ద్వారా పెద్దపల్లి ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్కు గంటల కొద్దీ ప్రయాణం చేసే అవసరం లేకుండా ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుందని అన్నారు. దీనివల్ల నూతన ఆర్థిక, పారిశ్రామి అవకాశాలు వస్తాయని అన్నారు. ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ పూర్తయ్యాక సెంటర్ ఫిజిబిలిటీ స్టడీ ఉంటుందని గడ్డం వంశీకృష్ణ తెలిపారు.