కాల్వ శ్రీరాంపూర్, జూలై 9 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గురువారం ఉదయం స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మంగపేట గ్రామం నుంచి విద్యార్థులతో పెగడపల్లిలోని సన్ షైన్ స్కూల్‌కు వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి మొదట విద్యుత్ స్తంభాన్ని, అనంతరం చెట్టును ఢీకొట్టింది. కాగా, డ్రైవర్ పిల్లలను అక్కడే వదిలేసి వ్యాన్ తీసుకొని వెళ్లిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు.
అయితే, అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలితే డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.