కోల్ సిటీ, ఫిబ్రవరి 11: ఓటు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ఇది తెలిసి కూడా నేటితరం యువత ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకోవడంలో అశ్రద్ధ చూపుతుంది. ప్రతిఫలంగా వంద శాతం పోలింగ్ నమోదు అసాధ్యం అవుతుంది. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణంలో ఓటు ఒక వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయడానికి ముందుకు వస్తేనే ఇది సాధ్యం. ఇది ముమ్మాటికి అక్షర సత్యం. ఐతే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 90 యేళ్ల వయసులో కూడా నాటితరం వృద్ధురాలు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసి నేటితరాన్ని మేల్కొలిపి ఆదర్శంగా నిలిచింది.
స్థానిక 58వ డివిజన్ అడ్డగుంటపల్లికి చెందిన కోడూరి మధునమ్మ (90) అనే వృద్ధురాలు బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చెక్కు చెదరని సామాజిక బాధ్యతతో పోలింగ్ బూత్ కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. బుధవారం మధ్యాహ్నం 11 గం.ల వరకు రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కేవలం 24 శాతం పోలింగ్ నమోదైంది.
అప్పటికీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పోలింగ్ శాతం గంట గంటకు స్వల్పంగానే పెరుగుతుంది. విశ్రాంతి తీసుకునే 90 యేళ్ల వయసులో సైతం మధునమ్మ తనకెందుకు అనుకోకుండా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు విలువను చాటిచెప్పింది. ఇప్పటికి ఐదు తరాలను చూసిన మధునమ్మ భవిష్యత్లో ఏలాంటి ఎన్నికలు వచ్చినా స్వచ్చందంగా తప్పకుండా ఓటు వేస్తానని ధీమా వ్యక్తం చేసింది.