సుల్తానాబాద్ రూరల్, మార్చి 22: ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అపర నష్టం వాటిల్లింది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన సంబుల లచ్చయ్య అనే వ్యక్తికి చెందిన గొర్ల కోసం వేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. దీంతో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటిలో 8 చిన్న గొర్రెలు కూడా ఉన్నాయి. మరో 15 గొర్రెలకు గాయాలయ్యాయి. అక్కడే పక్కకు పడుకున్న లచ్చయ్య ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చయ్య గొర్లను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. జీవనాధారమైన గొర్రెలు మృతిచెందడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలన్నారు.