Peddapalli | పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి గుంతలను తప్పించబోయి ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామానికి చెందిన కత్తెర్ల లక్ష్మణ్ యాదవ్ తన బంధువుల పెళ్లి ఉండటంతో పెద్దపల్లికి వెళ్లాడు. భార్య, ఇద్దరు కుమార్తెలతో పెళ్లికి వచ్చిన లక్ష్మణ్ ఆదివారం సాయంత్రం బైక్పై తిరుగుప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో కాసుపల్లి సమీపంలో రోడ్డు మీద ఉన్న గుంతలను తప్పించబోతుండగా బైక్ అదుపుతప్పి కిందపడింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి లక్ష్మణ్ యాదవ్ కుమార్తె శ్రీ ముకుంద (15) అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వీరిని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు.