Peddapalli | పెద్దపల్లి రూరల్, మార్చి 22 : మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది. అప్పులు, సప్పులు చేసుకుని ప్రభుత్వ సాయం అందకపోయినా పంటలు పండించుకుందామంటే యాసంగి వేసిన పంటలు కాస్త అకాల వర్షాలతో నేలపాలయ్యాయి.
శుక్రవారం సాయంత్రం కారుమబ్బులు కమ్ముకుని కురిసిన వర్షంతో మొదలైన రాళ్ల వాన హన్మంతునిపేటను ముంచెత్తడంతో పంటలన్నీ నేలకొరిగాయి. పెద్దపల్లి మండలంలో శుక్రవారం కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను మండల వ్యవసాయ అధికారిణి, విస్తీర్ణాధికారులతో కలిసి పరిశీలించారు. మండలంలోని ముత్తారం, రాంపల్లి, హనుమంతునిపేట, భోజన్నపేట, చీకు రాయి, పెద్ద బొంకూర్ గ్రామాల్లో వడగళ్ళ వర్షానికి నష్టపోయిన వరి, మొక్కజొన్న పంటలతో పాటు పెసర, నువ్వు , కూరగాయల పంటలను పరిశీలించగా దాదాపుగా 1300 ఎకరాలలో వరి 291 ఎకరాలలో మొక్కజొన్న పంటలు నష్టాలభారిన పడ్డట్లు అంచనా వేశారు. అలాగే కూరగాయ పంటలు, పెసర, నువ్వు పంటలు కూడా నష్టపోయినట్టు తెలిపారు.. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు బాధిత రైతులు కోరుతున్నారు.