Peddapally | పెద్దపల్లి, జూన్ 25(నమస్తే తెలంగాణ) / పెద్దపల్లి రూరల్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మితి మీరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తల కేసుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో మరో సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిట్టూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కల్లెపు సంపత్‌రావు కూతురుకు సంబంధించిన విడాకుల కేసు విషయంలో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులపై 15రోజులు క్రితం పెద్దపల్లి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ కౌన్సిలింగ్ ఇతరత్రా పంచాయితీ నిర్వహించి అక్కడ అది గొడవకు దారి తీసింది. దీంతో సంపత్‌రావు కుటుంబ సభ్యులు, అల్లుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు పెద్దపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న కేసును పక్కన పెట్టిన పెద్దపల్లి పట్టణ పోలీసులు బుధవారం సంపత్రావుపై మరో ఫిర్యాదు వచ్చిందని, పోలీసు స్టేషన్‌కు రావాలని పెద్దపల్లి పట్టణ ఎస్ఐ నరేష్ వేధింపులకు గురి చేశాడు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే బాధితుడి స్వగ్రామం నిట్టూరులో ఒకరి పొలంలో నారును పాడు చేశావని, దున్నించావని ఫిర్యాదు వచ్చింది పోలీసు స్టేషన్‌కు రావాలని పెద్దపల్లి పట్టణ ఎఐ సంపత్‌రావు ఇంటికి నేరుగా ఒక కానిస్టేబుల్‌ను పంపడం ఆ సమయంలో సంపత్‌రావు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన దశ దిన ఖర్మలో ఉండగా.. అక్కడికీ కానిస్టేబుల్ వెళ్లి ‘నీపై కేసు అయ్యింది.. ఎస్ఐ రమ్మంటున్నాడు.. నీ వెంట ఉండి తీసుకొని రమ్మన్నాడని చెప్పాడు..’ దీంతో తీవ్ర అవమానంగా భావించిన సంపత్‌రావు ఎస్ఐకి ఫోన్ చేసి ‘ఏమైంది సార్.. నన్ను ఎందుకో రమ్మంటున్నారట.. మీ కానిస్టేబుల్ వచ్చిండు.. నేను తర్వాత వచ్చి మాట్లాడుతా..’ అని ఫోన్ చేసిన చెప్పినా ఎస్ఐ నరేష్ ‘అలాంటిదేమీ లేదు.. నీపై నిట్టూరులో నారు చెరిపేశావని, వారికి నష్టం చేశావని కాంప్లెంట్ వచ్చింది.. ముందు పోలీసు స్టేషన్‌కు రా..’ అని చెప్పాడు. దీంతో సంపత్‌రావు.. సార్ నన్ను ఘోరంగా అవమానిస్తున్నారు.. నేను చేసిన నేరం ఏమిటీ.. ఘోరం ఏమిటీ.. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు. ఊరిలో నేను ఎవరి నారును చెరిపేయలేదు.. మీరు వచ్చి విచారించుకోండి.. నేను ఇక్కడ చేస్తే ఈ కేసు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మీదగ్గర ఎందుకు కేసు అవుతుందని చెప్పినప్పటికీ ఎస్ఐ విన లేదు. దీంతో ఫోన్లోనే సంపత్‌రావు.. ‘సార్ నేను మీ పోలీసు స్టేషన్‌కు వస్తున్నా.. మందు డబ్బా తీసుకొని వచ్చి నేను నా కుటుంబం మొత్తం స్టేషన్లో తాగి చనిపోతాం..’ అని చెప్పడంతో కానిస్టేబుల్ వెంటనే అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.
నేరుస్తుల మాదరిగా తన ఇంటికి కానిస్టేబుల్‌ను పంపడం, దశ దిన ఖర్మ దగ్గరికి వచ్చి అక్కడ, వరపూజ కార్యక్రమానికి వెళితే.. అక్కడికి వెళ్లి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళతానని చెప్పడంతో తీవ్రంగా కలత చెందిన సంపత్‌రావు ఇంటిలోకి వెళ్లి ఇంట్లో భార్యకు పిల్లలకు జరిగిన అవమానాన్ని చెప్పి ఏడ్చుకుంటూ ఇంటి వెనకకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇంటి వెనక ఉన్న చొప్పలోకి వెళ్లి పురుగుల మందు సేవించి కాళ్లు చేతులు కొట్టుకుంటూ కనిపించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంపత్‌రావు పరిస్థితి విషమంగా ఉంది. చావు బ్రతుకుల మధ్య సంపత్‌రావు పోరాడుతుండగా.. ఆయన ఈ స్థితికి పెద్దపల్లి సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్లే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ నరేష్‌ను వివరణ కోరగా.. తాను సపత్రావును వేధించలేదని, నేను నారు ధ్వంసం చేసిన కేసులో పిలవలేదు. పెద్దపల్లి ఆర్కే గార్డెన్లో జరిగిన గొడవ విషయంలోనే రావాలని కోరామన్నారు. ఇదిలా ఉండగా సంపత్‌రావుతో ఎస్ఐ ఫోన్ మాట్లాడిన సందర్భంలో మాత్రం టౌన్ గొడవ కేసు గురించి కాకుండా నిట్టూరులో నారును చెడిపేశావని, దున్ని ధ్వంసం చేశావని పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పడం విశేషం.
మా నాన్నను పోలీసులు తీవ్రంగా అవమానించారు.. : కల్లెపు శ్రీనివాసరావు
మేం గ్రామంలో కొంత పలుకుబడితోనే బ్రతుకుతున్నాం. చెల్లెలి కాపురం విషయంలో గొడవల కారణంగా మేం ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంలో మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అక్కడ మాకు న్యాయం జరగలేదు. అక్కడ మాపైనే దాడి చేశారు. ఇరు వర్గాల వారం ఒకరిపై ఒకరం ఫిర్యాదులు చేసుకున్నాం. న్యాయ స్థానంలో తేల్చుకుంటామని చెప్పి ఇంటికి వచ్చేశాం. అప్పటి నుంచి పెద్దపల్లి పట్టణ ఎస్ఐ నరేష్ నాన్నను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. నాన్నకు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఎవరికీ ఏ నష్టం చేయకపోయినా ఫిర్యాదు వచ్చిందని పెద్దపల్లి పట్టణ ఎస్ఐ పోలీసు స్టేషన్‌కు రావాలని వేధించాడు. కానిస్టేబుల్‌ను ఇంటికి పంపించాడు. నానమ్మ చనిపోతే.. అక్కడ దశ దినకర్మలో ఉన్నాడని చెబితే.. అక్కడికి వెళ్లి పోలీసు స్టేషన్‌కు రావాలని కానిస్టేబుల్ నాన్న పరువు తీశాడు. నాన్న ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పినా వినిపించుకోలేదు. దీన్ని మా నాన్న తీవ్ర అవమానంగా భావించాడు.
పోలీసు స్టేషన్‌కు వచ్చి అక్కడే మాకుటుంబం అంతా పురుగుల మందు తాగుతాం.. అని సైతం ఎస్ఐకి నాన్న చెప్పిండు. నువ్వు బాగా తాగి ఉన్నావ్ తాగింది దిగినాక ఎస్ఐ రమ్మనడంతో తీవ్రంగా కలత చెందాడు. ఇంటి వెనకు వెళ్లి పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా నాన్న ఈ స్థితికి పెద్దపల్లి ఎస్ఐ, సీఐ, కానిస్టేబుల్లే కారణం. నిజంగా మా నాన్న గ్రామంలో ఎవరి నారును చెడిపేయలేదు. తప్పుడు ఫిర్యాదులు చేయించారు. మా ఊరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది అయినప్పటికీ పెద్దపల్లి పట్టణ ఎస్ఐ నరేష్ కావాలనే మా సోదరి విడాకుల కేసులో ప్రత్యర్థుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మమ్మల్ని వేధిస్తున్నాడు.