Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హకీంపేట భూ బాధితులకు అండగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు రైతులు, భూ బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భూసేకరణ, పరిహారం, ఆర్అండ్ఆర్ కాలనీ ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, రోటిబండ్లతండా, పులిచెర్లతండా, ఈర్లపల్లి తదితర ప్రాంతాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం భారీగా భూములు సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూములు కోల్పోయిన రైతుల కోసం అదే ఇండస్ట్రియల్ పార్కులో సుమారు 93 ఎకరాల్లో నిర్వాసితుల కాలనీని ఏర్పాటు చేసి 692 ప్లాట్లను బాధితులకు కేటాయిస్తున్నారు.
దీంతో ఇక్కడ ఓ కొత్త పట్టణమే వెలిసే అవకాశం ఉన్నది. కానీ, భూ బాధితులకు కేటాయించిన కాలనీలో కోట్లు దండుకునే ప్రయత్నమే జరుగుతున్నది తప్ప.. కనీస మౌలిక సదుపాయాలు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వం తరఫున నిర్వాసితుల కోసం ఏర్పాటుచేస్తున్న ఈ కాలనీలో ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల్లో కనీస ప్రమాణాలు పాటించలేదు. వాటిని ఆదరా బాదరాగా వేస్తున్నట్టు కనబడుతున్నది. బీటీ రోడ్లను అడ్డదిడ్డంగా వేస్తూ రూ.కోట్లాది దండుకున్నారు. లేఅవుట్ చేశాక అధికారులకు గుర్తొచ్చిందో? ఏమో? కానీ నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటుచేస్తూ సరికొత్త అధ్యాయానికి తెర లేపారు. ఈ 93 ఎకరాల భారీ లేఅవుట్లో ఎక్కడ కూడా పార్కులకు కానీ, గుడులకు, బడులకూ స్థలాలు కేటాయించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కేవలం అంగన్వాడీ కేంద్రానికి 1,200 గజాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
హకీంపేట నిర్వాసితుల కాలనీలో ఓ కుటుంబానికి 8.21 గుంటల భూములను లాక్కొన్నారు. హకీంపేట గ్రామానికి చెందిన ర్యాకం అరుణమ్మకు 2 ఎకరాలు, యాదయ్యకు 2.21 ఎకరాలు, భీమమ్మకు 2 ఎకరాలు, రాజేశ్‌కు 1 ఎకరా, రంజిత్‌కు 1 ఎకరా చొప్పున భూములు ఉన్నాయి. ఇది కోస్గి తునికిమెట్లకు పోయేందుకు కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నది. ఆ భూములపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని నానా తిప్పలు పెడుతున్నారు.ఆ కుటుంబానికి న్యాయంగా రూ.1.50 కోట్ల పరిహారం రావాలి. ‘మా పరిహారం మాకిప్పియ్యండి’ అంటూ ఆ బాధిత కుటుంబం అడిగితే వారిపైనే దౌర్జన్యాలకు దిగుతూ ‘రెండు ఎకరాలకే పరిహారం ఇస్తాం తీసుకుపోండి’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో చేసేదిలేక ఆ కుటుంబం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా భూసేకరణ అధికారి, తాండూరు ఆర్డీవోను కూడా సంప్రదించారు. దుద్యాల తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వాలని, అంతవరకు తమ భూములు తీసుకోవద్దని వేడుకున్నారు. దాదాపు ఏడాదిపాటు తిరిగి తిరిగి.. విసిగి వేసారిన ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఏకంగా స్టేటస్కో ఆర్డర్లు తీసుకొచ్చింది. అయినా కాంగ్రెస్ నేతల