సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ చుక్కలు చూపుతున్నది. సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నరకం చూపెడుతున్నది. రద్దీకి సరిపడా బస్సులు నడపక ఇబ్బందులకు గురి చేస్తున్నది. బస్సుల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటి వరకు ఒక్క బస్సును కూడా పెంచకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి ఇళ్లకు చేరుకోవాల్సి వస్తున్నది. కుటుంబ సమేతంగా ప్రయాణిస్తున్న వారైతే లగేజీ, పిల్లలను వెంటేసుకొని గంటల తరబడి బస్సుల కోసం బస్టేషన్లలో నిరీక్షించాల్సిన దుస్థితి ఉన్నది. రాత్రి వేళ పిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. జంక్షన్‌లా మారిన కరీంనగర్ బస్టేషన్ నాలుగైదు రోజుల నుంచి ఎప్పుడు చూసినా వేలాది మందితో కిక్కిరిసిపోయి కనిపిస్తుండగా, ‘బస్సు ఎప్పుడొస్తుందా..?’ అని ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ జేబీఎస్ నుంచి కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్ తదితర పట్టణాలకు రావడానికి అష్టకష్టాలు పడుతున్నారు. సీటు కోసం చూస్తే ఇంటికి వెళ్లే పరిస్థితి లేక నిలబడే ప్రయాణిస్తున్నారు. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు చెల్లించినా సీటు దొరక్క నిల్చుండే వెళ్తున్నారు. పండగ సందడి మొదలైనప్పటి నుంచి ఏ ఊరి బస్సును చూసినా కిక్కిరిసి వెళ్తున్నది. ప్రయాణికులను కుక్కి కుక్కి పంపిస్తుండగా, ఓవర్‌లోడ్‌తో బస్సులు మొరాయించే దుస్థితి ఏర్పడుతున్నది.
కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 ఆర్టీసీ డిపోల్లో 817 బస్సులు నడుస్తున్నాయి. అయితే పండుగ సమయాల్లో రద్దీ ఉన్న రూట్లలో ఎక్కువ బస్సులు నడిపిస్తుంటారు. ప్రధానంగా హైదరాబాద్, కరీంనగర్, గోదావరిఖని రూట్లలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ లగ్జరీ, రాజధాని సర్వీసులు వేస్తుంటారు. ఇప్పుడు ఈ రూట్లలో పల్లె వెలుగు బస్సులు కూడా నడిపిస్తున్నారు. ఇక పల్లె వెలుగు బస్సులు నడిచే రూట్లలో బస్సుల సంఖ్య తగ్గింది. దీంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్ చేరుకున్న ప్రయాణికులు స్వగ్రామాలకు చేరడానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ప్రస్తుత రద్దీకి సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు గంటల తరబడి కరీంనగర్ బస్టేషన్లో నిరీక్షించాల్సి వస్తున్నది. వచ్చిన కొద్ది బస్సుల్లోనే సర్దుకొని వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. కరీంనగర్ నుంచి జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, పెద్దపల్లి, ఓదెల, మంథని తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడుగుపెట్టే సందు ఉండడం లేదు. ఈ రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తుంటే.. సరిపడా బస్సులు లేకుంటే తాము గమ్య స్థానాలకు ఎలా వెళ్తామని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి అడ్డగోలు చార్జీలు వెచ్చించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తున్నది.
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే కరీంనగర్ బస్టేషన్ జంక్షన్‌గా ఉన్నది. పండుగ సందడి మొదలైనప్పటి నుంచి ఈ బస్టేషన్లో ఎప్పడూ విపరీతమైన రద్దీతో కనిపిస్తున్నది. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు హైదరాబాద్‌కు వెళ్లాలంటే నరకం చూస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో వయా కరీంనగర్ వరకు వస్తున్నారు. తీరా ఇక్కడ చూస్తే హైదరాబాద్ వెళ్లేందుకు సరిపడా బస్సుల్లేక గోస పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి కరీంనగర్ బస్టేషన్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఇక జేబీఏస్ నుంచి అదనంగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా గంటల తరబడి నిరీక్షిస్తే తప్పా దొరకడం లేదు. అది కూడా చాలా వరకు నిల్చుండే ప్రయాణించాల్సి వస్తున్నది. కరీంనగర్ రీజియన్ మేనేజర్ రాజు హైదరాబాద్ జేబీఎస్‌లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 500 ట్రిప్పుల్లో సుమారు 70 వేలకుపైగా ప్రయాణికులను జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. వీకెండ్ కావడం, ఆదివారం కలుపుకొని పండగ సెలవులు రావడంతో శనివారం ఒక్క రోజు 50 వేలకుపైగా ప్రయాణికులు కరీంనగర్, హైదరాబాద్ మధ్యన రాకపోకలు సాగించినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్‌లో ఉంటున్న కరీంనగర్‌కు చెందిన రాజేశ్ దంపతులు పండగ కోసం తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేందుకు శనివారం ఉదయం జేబీఎస్ బస్టేషన్‌కు వచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్ రావడానికి ఒక్క బస్సు అందుబాటులో లేక గంటలపాటు బస్టేషన్లోనే నిరీక్షించారు. వచ్చిన బస్సులు క్షణాల్లో కిక్కిరిసి పోతున్నాయి. పిల్లలు ఉన్నారని సీట్ల కోసం వెతికితే వచ్చిన బస్సులు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు ఒక బస్సు ఎక్కారు. వీళ్లు ఎక్కిన బస్సు కూడా అన్నింటిలాగే కిక్కిరిసి పోయింది. అయితే ఈ బస్సు కరీంనగర్ చేరుకునే సరికి ఆరు గంటల సమయం పట్టింది. సీట్ల కోసం చూస్తే అక్కడి నుంచి కరీంనగర్ రాలేమని తెలుసుకుని చాలా మంది నిలబడే వస్తున్నారని, అయినా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని అజయ్ వాపోయాడు. అజయ్లాగేనే ఎంతో మంది పండుగ వేళ పిల్ల పాపలతో అతికష్టం మీదా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.
నేను హైదరాబాద్ నుంచి పిల్లల్ని తీసుకుని కోరుట్లకు పోతున్న. కరీంనగర్ వరకే టికెట్ మీద 150 పెంచిన్రు. ఇట్ల చార్జీలు పెంచినట్టే బస్సులు కూడా పెంచాలి కదా! ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకుంట లేరు. ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లలను వేసుకుని ఇళ్లకు పోతున్నరు. ఉన్నకాన్నే పండుగ చేసుకోక ఎందుకు వచ్చాంరా బాబు అని తలలు పట్టుకుంటున్నరు.
సంక్రాంతి పండుగకు సహజంగానే రద్దీ ఎక్కువగా ఉంటది. ముఖ్యంగా ఈటైంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది కరీంనగర్ రీజియన్ పరిధిలోని వివిధ జిల్లాలకు వస్తుంటారు. అందుకు తగినట్టుగానే ఈ మార్గంలో 250 బస్సులు అదనంగా నడుపుతున్నాం. గడిచిన రెండు రోజుల్లో 70 వేలకుపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. శనివారం ఒక్క రోజు ఎక్కువ రద్దీ ఉన్నది. రేపటి నుంచి పండుగ పూర్తయ్యే వరకు సాధారణ పరిస్థితులు కనిపిస్తాయి. పండుగ కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా వేశాం. పల్లె వెలుగు బస్సులు జిల్లా కేంద్రాల నుంచి ఆయా మార్గాల్లోనే నడుపుతున్నాం.
నేను నిజామాబాద్ పోదామని ఫ్యామిలీతో కలిసి కరీంనగర్ బస్టాండ్ వచ్చిన. గంటకు మీదనే అయింది. ఒక్క బస్సు లేదు. ఇక్కడ చూస్తే నరకం కనిపిస్తంది. మస్తు మంది ఇబ్బంది పడుతున్నరు. చిన్న పిల్లలు చలికి వణికి పోతున్నరు. ఎక్స్‌ప్రెస్‌ల కూడా కుక్కికుక్కి ఎక్కిస్తున్నరు. ఇది పోతే ఇంకో బస్సు రాదని ఆర్టీసీ వాళ్లే చెప్తున్నరు. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లయినా నిలబడి పోతున్నరు.
బస్టాండ్లకచ్చి గంటన్నర అయితంది. మా మల్లాపూర్‌కు పొయెతానికి ఒక్క బస్సత్త లేదు. వచ్చిన బస్సుకు ఎగవడి ఎక్కుతున్నరు. ఒకల మీదొకలువడి ఎక్కుతున్నరు. నేను కింద పడ్తనని ఎక్కలేక పోతున్న. ఇట్లనే ఉంటే ఈ రాత్రికి కరీనారం బస్టాండ్లనే ఉండుడైతదో.. ఏందో. బస్సులు ఎక్కువ నడిపితే ఈళ్లకు ఏమైతది?
సిద్దిపేట బస్టాండ్ల నిలబడీ నిలబడి యాస్టకచ్చింది. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ వెహికిల్‌లో కరీంనగర్ వచ్చిన. 140 తీసుకున్నరు. ఇక్కడి నుంచి నేను పెద్దపల్లికి, అక్కడి నుంచి కమాన్‌పూర్‌కు వెళ్లాలే. ఇక్కడ కూడా సిద్దిపేట లెక్కనే ఉంది. ఒక్క బస్సు వస్త లేదు. చీకటైతంది. చలి పెడుతంది. ఇంటికి ఎట్ల పోవుడో అర్ధమైత లేదు. పోయేసరికి ఏ రాత్రయితదో. పండుగ పూటనైనా కొన్ని ఎక్కువ బస్సులు వేస్తే బాగుండు. కరీంనగర్ అన్ని ప్రాంతాలకు జంక్షన్ లెక్కున్నది. కనీసం ఇక్కడి నుంచైనా బస్సులు పెంచితే బాగుండు.