కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 4 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం విజయోత్సవ సభల పేరిట ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విజయోత్సవసభల పేరిట ఎన్నికల సభలు నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కరీంనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సోయిలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్‌రెడ్డేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే విజయోత్సవ సభలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. హుస్నాబాద్‌లో జరిగిన విజయోత్సవసభకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు, సూల్ పిల్లల్ని తరలించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి విజయోత్సవ సభలు నిర్వహించుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే తప్ప కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తుకు రావడం లేదన్నారు. ఎన్నికల కోసం మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ స్పందించి వెంటనే విజయోత్సవ సభలను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ తిరుమల్ రావు, గట్టుబుతూరు మాజీ సర్పంచ్ విజేందర్‌రెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, నాయకులు సత్తినేని శ్రీనివాస్, నవీన్ రావు, చొప్పదండి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.