‘పాకిస్థాన్ పెద్ద పిరికి పంద. తలుచుకుంటే ఆ దేశాన్ని ఒక గంటల్లో నేలమట్టం చేసే శక్తి మన ఇండియన్ ఆర్మీకి ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలోనూ భారతే గెలిచింది. ఇప్పుడు మరింత టెక్నాలజీతో దూసుకెళ్తున్నది. ఇప్పుడు జరిగే యుద్ధంలోనూ మళ్లీ మన దేశమే గెలుస్తుంది. మనమంటే పాక్‌కు చావు భయమే. అది వాళ్లకు కూడా తెలుసు’ అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ సైనికులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతున్న తరుణంలో ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రశంసిస్తూనే.. ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 1971లో పాక్‌తో వచ్చిన యుద్ధంలో.. 1999లో వచ్చిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రోజులను, అప్పుడు ఆ దేశ సైనికులను మట్టికరిపించిన తీరును వివరించారు. పాక్ సైనికులకు మనతో యుద్ధం అంటేనే తడిసిపోతుందని, యుద్ధం చేతగాకనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటారని చెప్పారు. పహల్గాం దాడి ఘటన తర్వాత తమ రక్తం మరిగిపోతున్నదని, ఆర్మీ నుంచి పిలుపు వస్తే వెంటనే యుద్ధంలో పాల్గొని బుద్ధి చెబుతామని చెబుతున్నారు.
పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ఎదుర్కోవడమే కాదు అవసరమైతే ఆ దేశ భూభాగాన్ని పూర్తిగా ఆక్రమించుకునే శక్తి యుక్తులు ఇండియన్ ఆర్మీకి ఉన్నాయి. ముందు నుంచీ పాక్ కంటే ఎందులోనూ భారత్ తగ్గలేదు. ప్రతి యుద్ధంలో భారత్ గెలిచింది. ఇప్పుడు ఆర్మీ ఎంతో ఆధునికతను పునికి పుచ్చుకున్నది. పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధంలో దూసుకెళ్తున్నది. మన ఇండియన్ ఆర్మీ శక్తి యుక్తుల ముందు పాక్ సైన్యం మోకరిల్లాల్సిందే. నేను ఇండియన్ ఆర్మీలో 1995లో చేరి 2011లో పదవీ విరమణ చేశా. మేం పని చేస్తున్న సమయంలో 1999లో కార్గిల్ యుద్ధం వచ్చింది. అందులో విజయం సాధించడం నా జీవితంలో మర్చిపోలేను. అప్పుడు ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ అపజయం చవిచూడలేదు. అప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరమయ్యేది.
మన బార్డర్ దాటి వాళ్ల బార్డర్లోకి వెళ్లి యుద్ధాలకు దిగేవాళ్లం. అక్కడ వాళ్ల బంకర్లను పేల్చి మళ్లీ మన బార్డర్లోకి వచ్చే వాళ్లం. అప్పుడు మేం దేన్నైనా పేల్చాలంటే రాకెట్ లాంచర్ల(ఆర్ఆర్ఎల్)ను వాడే వాళ్లం. దాడులకు ఎంఎంజీ, ఏజీఎస్, ఏజీఎల్, ఎస్ఎల్ఆర్, ఏకే-47, ఇన్సాట్రైఫుల్ లాంటి ఆయుధాలను వినియోగించేవాళ్లం. ఇప్పుడు మన ఆర్మీ చాలా పటిష్టమైంది. రాఫెల్ యుద్ధ విమానాలను వాడుతున్నాం. మన బార్డర్లోనే ఉండి ఆ దేశంలోని ఏ స్థావరాన్నైనా కూల్చే శక్తి ఇప్పుడు మన ఆర్మీకి ఉంది. మిషనరీని వినియోగించే సాంకేతికత మన ఆర్మీకి ఉంది. అప్పుడు అటాక్ చేసి అక్కడికి వెళ్లి మన జాతీయ జెండాను పాతే వాళ్లం. ఇప్పుడు వెపన్స్ ఆమేషన్స్ ఉన్నాయి. మరింత దీటుగా ఎలాంటి దాడులనైనా చేయగలం. చేసే వారిని నిలువరించగలం.
– కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ హవల్దార్ దామోదర్‌రాజు, పెద్దపల్లి
నేను ఆర్మీలో రిక్రూట్ అయిన ఏడాదికే కార్గిల్ యుద్ధం వచ్చింది. ఎంతో ధైర్యంగా యుద్ధంలో పాల్గొన్న. మోటర్ ప్లటూన్ మద్రాస్ వింగ్‌లో ఉండే వాడిని. 81 ఎంఎం మోటర్ ద్వారా గుండ్లు లోడ్ చేసి కొడితే 5 కిలో మీటర్ల దూరంలోని శత్రువును నాశనం చేసేది. ఆ రోజుల్లో ఎక్కువగా రైఫిళ్లతో ముఖాముఖి యుద్ధమే జరిగేది. శత్రువులు ఎదురు పడితే చంపడమో.. చావడమో అన్నట్టు ఉండేది. కార్గిల్ యుద్ధంలో 2000 డిసెంబర్ 16న మా బెటాలియన్ 16 మంది శత్రువులను మట్టు బెట్టింది. అందులో చురుకుగా పాల్గొన్న నాకు 15 వేల రివార్డు ఇచ్చింది. అంతే కాకుండా, యూఎన్ కమిషన్‌కు పంపించింది. కార్గిల్ యుద్ధం తర్వాత ఏడాది పాటు యూఎన్‌లో సేవలు అందించి వచ్చా. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి అరుదైన అవకాశం ఇప్పటి వరకు నాకు ఒక్కడికే దక్కింది.
18 ఏండ్ల నా సర్వీసులో తొమ్మిదేండ్లు జమ్మూ- కశ్మీర్‌లోనే పని చేశా. మిలిటెంట్లతో నిత్యం ఎన్కౌంటర్లు జరిగేవి. భారత సైనికులు చాలా సహనంతో వ్యవహరిస్తారు. ఎలాంటి సందర్భంలోనైనా భారత సైనికులు ముందుగా కాల్పులు జరిపేవారు కాదు. శత్రువులు కాల్పులకు తెగబడితే గానీ మా నుంచి ఎదురు కాల్పులు ఉండేవి కావు. పాకిస్థాన్ పెద్ద పిరికి పంద. చైనా ఆయుధాలు చూసుకుని ఇన్నాళ్లు మురిసి పోయింది. ఇండియా ఆయుధాలపై అవి పని చేయవని తెలిసి చావు భయంతో గగ్గోలు పెడుతున్నది. మన వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. తలుచుకుంటే పాకిస్థాన్‌ను ఒక గంటలో నేల మట్టం చేసే శక్తి మన దేశం వద్ద ఉన్నది. కానీ, సంయమనం పాటిస్తున్నది. దేశం తరఫున యుద్ధం చేయాలని ప్రతి సైనికునికి ఉంటుంది. కానీ, పాకిస్థాన్ సైనికులకు యుద్ధం అంటే తడిసిపోతది. చస్తామని భయపడి వెనక్కి వెళ్తున్నరు. మనకు వాళ్లకు ఉన్న తేడా అది. యుద్ధం జరిగితే ఇండియానే గెలుస్తది.
– అట్టెపల్లి తిరుపతి, కరీంనగర్
నేను 1971 సెప్టెంబర్ 15న ఆర్మీలో రిక్రూట్ అయిన. డిసెంబర్లోనే బంగ్లాదేశ్ తరఫున పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న. అప్పటికి నాకు రైఫిల్ ఎలా పేల్చాలో మాత్రమే తెలుసు. అయినా, ధైర్యంగా మన సైనికులతో కలిసి పోరాడిన. నేను 6వ బెటాలియన్.. అంటే సౌత్ ఇండియా తరఫున యుద్ధంలో పాల్గొన్న. అప్పుడు మమ్మల్ని చూసి పాకిస్థాన్ సైన్యం భయపడి పారిపోయేది. మా ముందు నిలబడలేక పోయేది. అప్పుడు రైఫిళ్లతోనే కొట్లాడేది. పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టేందుకు 12 రోజులు పట్టింది. అప్పుడు ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు మన దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నయి. పాకిస్థాన్ మనతో యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. ఆ దేశాన్ని నేల మట్టం చేసేందుకు ఒక్క రోజు చాలు. నాకిప్పుడు చేతగాకున్నా యుద్ధంలో పాల్గొనాలని ఉన్నది. సత్తువ లేకున్నా నెత్తురు ఉడుకుతంది. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలె.
– పింగిలి మల్లారెడ్డి, నర్సింగాపూర్ (వీణవంక మండలం)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో మతం చిచ్చు రేపాలని చూస్తున్నరు. అందుకే పహల్గాంలో మీరు హిందువులా.. ముస్లింలా అని అడిగి మరీ చంపేశారు. ఇది దారుణం. ఇలాంటి సమయంలో మన దేశ ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఇది గొప్ప విషయం. ఏ మతాన్ని కించపర్చవద్దు. ఏ మతాన్ని దూషించవద్దు. దేశ సమైక్యతకే ప్రజలను జాగృతం చేయాలె. ఇలాంటి సమయంలో అందరం కలిసి ఉండాలె. మనలో ఐకమత్యాన్ని చాటుకోవాలె. నేను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడిని. శత్రువుల దాడిలో నా కన్ను దెబ్బతిన్నది. కార్గిల్ యుద్ధంలో రాజౌరీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. దేశం కోసం కన్ను కోల్పోయినా బాధ పడలె. యుద్ధ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడితేనే విజయం సాధిస్తం.
కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఆపరేషన్ పరాక్రమం కోసం మూడేళ్లు రాజౌరీలోనే ఉన్న. ఆ సమయంలో చొరబాట్లకు యత్నించిన మిలిటెంట్లతో అనేక సార్లు ఫైరింగ్‌లో పాల్గొన్న. ఇప్పటికీ మాజీ సైనికుల అవసరం ఏర్పడి పిలుపు వస్తే వెంటనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న. నాలాగే ప్రతి మాజీ సైనికుడు యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటరు. ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు భారత్ అంటే ఏంటో చూపించాలె. ఇలాంటి సమయంలో మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలె. యుద్ధమనేది దేశ సరిహద్దుల్లోనే జరగదు. ఏ క్షణంలోనైనా ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. పాకిస్థాన్ చాలా పేద దేశం. ఇప్పటికీ ఆ దేశంలో రవాణా కోసం గాడిదలను ఉపయోగించుకుంటరు. నేను ఎల్వోసీకి అవతల ప్రత్యక్షంగా చూసిన. వాళ్లు ఉన్నట్టే ఇండియా కూడా పేదరికంలో ఉండాలనేది వాళ్ల కోరిక. మనం బాగుపడితే వాళ్లు ఓర్చుకోరు. అందుకే మనమీద కుట్రలు చేస్తుంటరు. ఈ కుట్రలను తిప్పి కొట్టాలంటే ఒకసారి తగిన బుద్ధి చెప్పాల్సిందే.
– దురిశెట్టి కిరణ్ కుమార్, కోరుట్ల