వీణవంక, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇప్పటికైనా ఇస్తారా? లేదా? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. మండల కేంద్రంలోని తన నివాసంలో కల్యాణలక్ష్మి దరఖాస్తులపై సంతకాలు చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం మాత్రమే ఇప్పటికీ అమలవుతున్నదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 1000కి పైగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశానని, ప్రభుత్వ హామీ తులం బంగారం మాత్రం ఎవరికీ రాలేదన్నారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఎంతమందికి వివాహాలు జరిగాయో అందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణం, జమ్మికుంట రూరల్, ఇల్లందకుంట, వీణవంకకు సంబంధించిన 300కు పైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులపై సంతకాలు చేసినట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తుందని తులం బంగారం హామీ అమలు చేయకపోతే బహిరంగ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.