జమ్మికుంట/ హుజూరాబాద్‌రూరల్, ఫిబ్రవరి7 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని 2, 3 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. సాయంత్రం ఆయన జమ్మికుంటలోని 16, 29వ వార్డుల్లో ర్యాలీ తీసి, ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఆయాచోట్ల జరిగిన కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ దొందూదొందేనని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించాలని విజ్ఞప్తి చేశారు.
వచ్చే ఎన్నికల్లో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని, అందుకు ఓటర్లంతా బీఆర్ఎస్కే పట్టంగట్టాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో హుజూరాబాద్‌లో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, రహదారులు, మున్సిపల్ మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేరొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చామని గుర్తు చేశారు.
హుజూరాబాద్‌లో గత మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న గందె రాధిక శ్రీనివాస్ హుజూరాబాద్ పట్టణంలో కోట్లాది రూపాయలతో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. జమ్మికుంటలో ఓటర్లతో కలిసి నృత్యాలు చేశారు. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు. ఆయాచోట్ల అభ్యర్థులు కొలుగూరి సురంజన్, లెంకలపెల్లి అశోక్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.