దండేపల్లి, ఆగస్టు 9 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరేడ్ల సతీశ్ ఇటీవల షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతడిని స్వదేశానికి రప్పించారు. నరేడ్ల సతీశ్ విషయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఫోన్లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సతీశ్‌ను రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. షార్జాలో హాస్పిటల్ ఖర్చులు భరించి, ఫ్లైట్ టికెట్ ఇప్పించి స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సతీశ్‌ను స్థానిక బీఆర్ఎస్ నాయకుడు అజయ్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి పంపించారు. ఎయిర్‌పోర్టులో అతడికి ఖర్చులకోసం రూ. 50 వేలు కూడా అందజేశారు. పరాయి దేశంలో గాయపడి, హాస్పిటల్ ఖర్చులు భరించలే, స్వదేశానికి తీసుకురాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేటీఆర్ సార్, విజిత్ రావు సార్ తమ కుటుంబానికి అండగా నిలిచారని బాధితుడి భార్య భవాని కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్, విజిత్ రావు సార్లకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.