ప్రయాగ్‌రాజ్, ఆగస్టు 9 : డేటింగ్ యాప్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా మగవారికి వల వేసి, వారిని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఒక కిలేడీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పల్లవీ రాజ్‌పుత్ హనీట్రాప్ ద్వారా పురుషులను ఆకర్షించి, వారి సన్నిహిత ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది.
టిండర్ లాంటి డేటింగ్ యాప్‌లతో పాటు, సామాజిక మాధ్యమాల్లో ప్రేమ, జీవిత భాగస్వామి పేరుతో మగవారిని ఆకర్షించేది. దీని కోసం పలు రకాల పేర్లతో అనేక ఖాతాలు నిర్వహించేది. ముఖ్యంగా స్వీటీ తివారీ లాంటి నకిలీ పేర్లను పెట్టుకునేది. తొలుత వారితో మామూలు సంభాషణలే జరిపేది. తర్వాత సన్నిహితం అయిన తర్వాత ఫోన్‌కాల్స్, వీడియో కాల్స్ చేయడం ప్రారంభించేది. తర్వాత వారిని రెచ్చగొట్టి అభ్యంతరకర భంగిమల్లో ఫొటోలు, వీడియోలు తీసేది. అప్పుడు తన అసలు స్వరూపం బయటపెట్టి వారిని బ్లాక్మెయిల్ చేసేది.
ఇలా బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక వేళ బెదిరింపులకు లొంగక, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్న బాధితులతో రేప్, హత్యాయత్నం లాంటి కేసులు పెడతామని హెచ్చరించేది. తప్పుడు ఆరోపణలతో ఆమె ఆరుగురిని జైలుకు కూడా పంపించింది. కొందరి సభ్యుల ముఠాతో బలవంతపు వసూళ్ల నెట్‌వర్క్‌ను కూడా నిర్వహించింది. ఈ ముఠాలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈమె 14 కేసుల్లో వాంటెడ్‌గా పోలీసు రికార్డులకెక్కింది.