Rain | ధర్మారం, మే 10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో రైతులు పోసిన వరి ధాన్యం తడిసింది. రైతులు తమ పంట పొలాల నుంచి పోసిన వరి ధాన్యం ను ట్రాక్టర్లలో తీసుకువచ్చి మార్కెట్ యార్డు ఆవరణలో ఆరబెట్టారు.
త్వరగా తేమ రావడం కోసం రైతులు వరి ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పకుండా ఎండ పోశారు. అయితే మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై అకాల వర్షం కురిసింది. దీంతో ఆరబెట్టిన వరిదాన్యం తడిసి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. మార్కెట్ యార్డు ఆవరణ ఏటవాలుగా ఉండడంతో వరద నీరు పోవడంతో కొందరి రైతుల వరి ధాన్యం కొట్టుకొని మార్కెట్ గేటు దాటిపోయింది. దీంతో రైతులు కొట్టుక పోయిన ధాన్యాన్ని కుప్ప చేయడానికి నాన తండాలు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొని తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల తడిసిన ధాన్యం గురించి జిల్లా మార్కెటింగ్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సమాచారం అందజేస్తానని ఏఎంసీ చైర్మన్ రూప నాయక్ తెలిపారు . కాగా ధర్మారం మండల కేంద్రంలో గాలి దుమారానికి గంధం లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన షెడ్ పై ఉన్న రేకులు విరిగి కింద పడ్డాయి. ఇంకా పలు గ్రామాల్లో కూడా అకాల వర్షం కురిసినట్లు తెలిసింది. వివరాలు తెలియాల్సి ఉంది.