కార్మిక క్షేత్రం సిరిసిల్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) అసెస్మెంట్ చేసిన ఐదు రోజుల్లోనే అనుమతులు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచే వంద సీట్ల కోసం అడ్మిషన్లకు అనుమతి లభించింది. మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావడంతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపగా, తమకు మెరుగైన వైద్య సేవలందించేలా మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన అమాత్యుడికి రుణపడి ఉంటామని జిల్లా ప్రజానీకం స్పష్టం చేస్తున్నది.
– రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)
Medical college | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : వస్త్ర పరిశ్రమకు కేంద్రమై.. తెలంగాణకే వెన్నెముకగా నిలిచిన కార్మిక క్షేత్రం ఎడ్యుకేషన్ హబ్‌గానూ అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కార్మిక, ధార్మిక క్షేత్రాల్లోని పేదింటి పిల్లలు ఉన్నత విద్యను అందుకోవాలన్న ఆకాంక్షతో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయించారు. వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, ఐటీఐ, జేఎన్టీయూ, నర్సింగ్ కళాశాలలు ఇదివరకే ఇక్కడ ప్రారంభం కాగా, కొత్తగా మెడికల్ కళాశాలకు అనుమతి లభించింది. కార్మిక క్షేత్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్ధేశంతో మంత్రి కేటీఆర్ ఇక్కడి వంద పడకల దవాఖానను 300ల పడకల స్థాయికి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రెండేళ్ల క్రితమే నర్సింగ్ కళాశాల ప్రారంభించగా, అందులో 400 మంది విద్యార్థినులు నర్సింగ్ విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా, మెడికల్ కళాశాలను మంజూరు చేయించారు. రెండో బైపాస్‌రోడ్డులోని పెద్దూరు సమీపంలో కళాశాలకు స్థలాన్ని కేటాయించగా, కళాశాలకు అనుబంధంగా దవాఖాన నిర్మాణం శరవేగంగా సాగుతున్నది.
తాజా ఉత్తర్వులతో రెట్టింపు ఉత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో గతేడాది కళాశాలను మంజూరు చేసింది. కళాశాల, దవాఖాన భవనాల నిర్మాణం కోసం రూ.166 కోట్లను కేటాయించింది. 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో 29 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తులతో 300ల పడకల దవాఖాన, మిగిలిన 31 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే దవాఖాన భవన నిర్మాణ పనులు చకాచకా సాగుతున్నాయి. ఇందులోని అన్ని విభాగాల గదుల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ)లోని ఐదుగురు ప్రతినిధుల బృందం సిరిసిల్లను సందర్శించిన ఐదు రోజుల్లోనే ఉత్తర్వులు రావడంతో మంత్రి కేటీఆర్ చొరవ వల్లనేనంటూ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరమే క్లాసులు
ఈ విద్యాసంవత్సరం నుంచే మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో బైపాస్‌రోడ్డులో తుది దశకు వచ్చిన దవాఖాన భవనంలోనే 100 సీట్లతో క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న ఏరియా దవాఖానను మెడికల్ కళాశాలకు అనుబంధంగా వినియోగించనున్నారు. దవాఖాన భవనంపై మరో అంతస్తును నిర్మించి, వంద పడకలున్న ఏరియా దవాఖానను 330 పడకలకు పెంచి, గదులన్నీ సిద్ధం చేశారు. మెడికల్ కళాశాల ప్రారంభమైతే జిల్లా వాసులకు మెరుగైన వైద్యం లభించే అవకాశం ఉన్నది.
మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
మెడికల్ కళాశాల రావడం సిరిసిల్ల జిల్లా ప్రజల అదృష్టం. కార్మిక రంగానికే పరిమితైన సిరిసిల్ల నేడు పెద్ద పెద్ద కళాశాలల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్‌గా మారి రాష్ర్టానికే స్ఫూర్తిగా నిలిచింది. ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫలితంగానే మెడికల్ కళాశాల వచ్చింది. ఇది శుభపరిణామం. సంతోషించదగ్గది. ఇకపై ప్రజలకు అధునాతన వైద్యం అందే అవకాశం ఉంటుంది. వైద్యులుగా రాణించాలన్న విద్యార్థుల ఆశయం నెరవేర్చుతున్న మంత్రికి ఐఎంఏ తరఫున కృతజ్ఞతలు.
– డాక్టర్ పెంచలయ్య, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు (రాజన్న సిరిసిల్ల)
కేటీఆర్ వల్లే సిరిసిల్లకు మహర్దశ
సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్‌దే. ఆయన రాకతో సిరిసిల్లకు మహర్దశ వచ్చింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల జిల్లా ప్రజలకు వైద్యవిద్య మరింత దగ్గర కానున్నది. కళాశాలలు లేక సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక మధ్యలోనే మానేసిన సందర్భాలున్నాయి. అలాంటి విద్యార్థుల ఆశయాలు మంత్రి కేటీఆర్ నెరవేర్చుతున్నందుకు తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు.
– కొండికొప్పుల రవి, టీటీయూ జిల్లా అధ్యక్షుడు, తడుకల సురేశ్, ప్రధాన కార్యదర్శి