హైకోర్టు దెబ్బకు రాష్ట్ర సర్కారు దిగొచ్చింది. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌ల) పాత పాలక వర్గాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో ఎన్నికైన పాలక వర్గాలే కొనసాగనున్నాయి. పాత అధ్యక్షులను తిరిగి కొనసాగించాలన్న తీర్పుతో సహకార సంఘాల అధ్యక్షులు, పాలక వర్గం సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యకత్వమవుతున్నాయి.
జగిత్యాల, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్‌లలో అత్యధిక శాతం బీఆర్ఎస్ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సరికొత్త ఎత్తుగడ వేసింది. సహకార సంఘాల పాలకవర్గాలన్నింటిపై వివక్ష చూపింది. గతేడాది డిసెంబర్ 14న జీవో 597 ద్వారా పీఏసీఎస్‌ల పాలక వర్గాలను తొలగించి, ప్రత్యేకాధికారులను నియమించింది. సహకార సంఘాల్లో పరిపాలన సాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సరిగా లేదని, రైతులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని సహకార సంఘాల నాయకులు, సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 597 జీఓను సవాల్ చేస్తూ పాలకవర్గాల సభ్యులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, కమిటీ సభ్యులనే కొనసాగించాలని సూచించింది.
ఈ క్రమంలోనే తాము ఇచ్చిన జీవోను సైతం విరమించుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం 597జీవోను రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ 199 జీవోను జారీ చేసింది. గతంలో రైతు సంఘాల సభ్యులతో ఎన్నికైన పాలక వర్గాల సభ్యులను సహకార సంఘ పాలకమండలి కమిటీ సభ్యులుగా కొనసాగాలని సూచించింది. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరి 14 నాటికి ఉన్న పాలకమండలి సభ్యులను సహకార సంఘాల పాలక మండలి సభ్యులుగా కొనసాగించాలని సహకార సంఘ ప్రత్యేక కమిషనర్, రిజిష్ర్టార్ ప్రసన్న తాజాగా మెమో (నంబర్ 8719/2018/పీఎసీఎస్-V) ద్వారా ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని సహకార అధికారులకు జారీ చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 52 సహకార సంఘాలకు గతంలో ఉన్న పాలక వర్గాలు కొనసాగనున్నాయి. తద్వారా సహకార సంఘ పరిపాలన వ్యవస్థ నిర్వహణతోపాటు సహకార సంఘాల పరిధిలో కొనసాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం తలొగ్గి, ఆ ఆదేశాలను పాటిస్తూ పాత కమిటీలను కొనసాగించే పరిస్థితి నెలకొంది. అయితే, సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులను సైతం నిబంధనలకు విరుద్ధంగా నామినేట్ చేసే అంశంపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కడ బీఆర్ఎస్కు చెందిన మద్దతుదారులు మెజార్టీని సాధిస్తారోనన్న ఆలోచనతో దొడ్డిదారిన తమ అనుచరులను పాలకవర్గాల్లో చేర్చేందుకు ఎత్తుగడలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది.
సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులను నామినేటేడ్ పద్ధతిలో ఎంపిక చేసే విషయాన్ని రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సైతం చర్చించినట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, ఈ విషయమై సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తూ సహకార వ్యవస్థకే తూట్లు పొడిచేలా ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రైతులకు మేలు చేసే సహకార సంఘాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని హితవుపలికారు. భవిష్యత్తులో నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైతే దానిపైనా న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.