Chada Venkata Reddy | కోల్ సిటీ, మే 24: ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని భాస్కర్ రావు భవన్ కు విచ్చేసిన ఆయన మాట్లాడారు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్తామని, వామపక్ష భావజాలన్నీ అంతం చేయడం ఎవరి తరం కాదని వెంకటరెడ్డి పేర్కొన్నారు.
దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైచాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆరోపించారు. మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వం తో శాంతి చర్చలు జరుపుతామని ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయడం లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికే ఆపరేషన్ కగార్ ను చేపట్టిందని తెలిపారు. అలాగే సీపీఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీఘడ్, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టు లో మేడ్చల్ జిల్లాలో జరుగన్నాయని ఆలోపు శాఖ, పట్టణ, మండల జిల్లా మహాసభలు పూర్తి చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడారు.
ఈ సమావేశం లో జిల్లా సహాయ కార్యదర్శి గోసిక మోహన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె కనకరాజ్, తాళ్లపెల్లి మల్లయ్య, కొడం స్వామి, నాయకులు లక్ష్మణ్, మర్కా పూరి సూర్య, రేణుకుంట్ల ప్రీతం, శనిగరపు చంద్రశేఖర్, అబ్దుల్ కరీం, తాళ్ళ పెల్లి సురేందర్, మాతంగి సాగర్ తదితరులు పాల్గొన్నారు.