Dharmaram | ధర్మారం, డిసెంబర్ 8 : ఆ బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. మొగిలి మోక్షిత్ (4) అనే బాలుడు వేడి సాంబారు పాత్రలో పడి మరణించిన సంఘటన పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో చోటుచేసుకుంది.
ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్ గత ఏడాదిన్నర కాలం నుంచి మల్లాపూర్ బాలికల గురుకుల విద్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. మధుకర్ అతడి కుటుంబ సభ్యులైన భార్య శారద, కూతురు శ్రీ మహి (8), కుమారుడు మోక్షిత్ (4) కలిసి విద్యాలయంలోని క్వార్టర్ లో నివాసం ఉంటూ అక్కడ వంట మనిషిగా పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం విద్యాలయంలోని వంట గదిలో మధుకర్ వంట చేసే పనిలో ఉన్నాడు.
మధుకర్ వంట పాత్రలో సాంబారు వండి దానిని పక్కన పెట్టాడు. ఈ క్రమంలో అతని కుమారుడు మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వంట గదిలోకి వచ్చి అకస్మాత్తుగా వేడిగా ఉన్న సాంబారు వంట పాత్రలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన తండ్రి మధుకర్ తన కొడుకును చికిత్స కోసం మొదట కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. అక్కడి నుంచి మోక్షిత్ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతుండగానే సోమవారం ఉదయం 10:30 గంటలకు అదే దవఖానలో పరిస్థితి విషమించి ఆ బాలుడు మరణించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాలుడి తండ్రి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
పుట్టిన రోజునే విషాదం
వేడి సాంబార్ లో పడి మరణించిన మోక్షిత్ బర్త్ డే రోజున మరణించడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం ఆ బాలుడి పుట్టినరోజు వేడుక జరగవలసి ఉంది. ఆదివారం వేడి సాంబార్ లో పడి తీవ్రంగా గాయపడడం అతని పుట్టిన రోజు సోమవారం మరణించడం ఆ కుటుంబంలో కలకలం రేపింది. మోక్షిత్ బర్త్ డే ఆనందంగా జరుపుకుందామని అనుకుంటున్న సందర్భంలోనే కండ్ల ముందే తమ కుమారుడు మృతి చెందడం ఆ బాలుడి తల్లిదండ్రులు మధుకర్ ,శారద శోకసముద్రంలో మునిగిపోయారు. మోక్షిత్ మరణంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.