ATTACK | చిగురుమామిడి, మార్చి 31: మండలంలోని గునుకుల పల్లె గ్రామంలో పాత కక్షలతో యువకుడిని కత్తితో పొడిచిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గునుకుల పల్లె గ్రామంలో బరిగెల శ్రీనివాస్ అతని భార్య లావణ్య ఇరువురు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఇంటి సమీపంలో ఉన్న గునుకుల హరికృష్ణ రెడ్డి 20 రోజుల క్రితం బరిగెల శ్రీనివాస్ ఇంటి వద్ద లేని సమయంలో అతని భార్యపై బలత్కారం చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తనపై కేసు పెడతావా అని హరికృష్ణ రెడ్డి కక్షను పెంచుకొని సోమవారం రోజున వ్యవసాయ పొలం వద్ద ఉన్న శ్రీనివాస్ పై కక్షలతో కడుపులో కత్తితో దాడి చేశారు. శ్రీనివాస్ రోడ్డు పై పరిగెత్తుకుంటూ వచ్చి పెట్రోల్ బంక్ వద్ద చౌరస్తా వద్ద అపస్మారక స్థితిలో పడిపోయాడు.
గమనించిన స్థానికులు 100 డయల్ నెంబర్ కు ఫోన్ చేయగా పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని 108 వాహనంలో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.