తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు నెరవేరుతున్నాయి. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటలవైపు మళ్లించి, రైతులు లాభాలు గడించేలా ఆయన తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు దేశానికి పామాయిల్ కొరతను తీర్చడానికి నాలుగేళ్ల కిందట రైతులను సన్నద్ధం చేసి, రాయితీ అందించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయించగా, ఇప్పుడు పంట చేతికందుతున్నది. తొలి పంట కోతకు రావడం, ధర కూడా బాగుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపల్లి, జూన్ 6(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/ కాల్వశ్రీరాంపూర్/ ముత్తారం : రైతుల అభ్యున్నతే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ సర్కారు లాభదాయకపంటల వైపు మళ్లించింది. రాయితీతో ఆయిల్‌పామ్ సాగువైపు ప్రోత్సహించింది. దాంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట వేయగా.. ప్రస్తుతం చేతికి వస్తున్నది. ఒక్క పెద్దపల్లి జిల్లాలో మూడు వేల ఎకరాల్లో 1100 మంది రైతులు సాగు చేయగా, నాలుగో ఏట
నుంచి అంటే ఇప్పుడు కోత మొదలైంది. శుక్రవారం తొలి క్రాప్ కటింగ్ అయింది. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నాంసాని సమ్మయ్య, కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్‌రెడ్డి, ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో బద్ధ్దం రాంరెడ్డి మొదటిసారిగా క్రాప్‌ను కట్ చేశారు.
ముత్తారం మండల రైతు సమ్మయ్యను జడ్పీ మాజీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సన్మానించగా.. అడవిశ్రీరాంపూర్ మండల రైతు దంపతులను కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా ఉద్యానవనాధికారి జగన్మోహన్రెడ్డి సన్మానించారు. అయితే, నాలుగేళ్ల తర్వాత క్రాప్ రావడంతో కోసిన గెలలను ఆయిల్ ఫెడ్ కంపెనీకి అప్పగించారు. క్రాప్ కంటింగ్ ఏడాది పొడవునా పదిసార్లు చేయనున్నారు. అదే విధంగా రైతులు మరో 25 నుంచి 30 ఏండ్ల వరకు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే ఏడాదికి పది సార్లు ఆదాయాన్ని పొందనున్నారు.
క్రాప్ కటింగ్‌కు రావడం ప్రారంభం కావడంతో ఆయిల్‌పామ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నాటికి జిల్లాలోని మొత్తం 1100 మంది రైతులకు చెందిన 3 వేల ఎకరాల పంట సైతం కోతకు రానున్నది. తొలి క్రాప్‌గా 15 వేల నుంచి 20 వేల వరకు ఆదాయం రానుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. తమ ఆదాయానికి, ఈ పంటల సాగుకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని, ఆయన నిర్విరామ కృషి ఫలితంగానే నేడు తాము ఆదాయాన్ని పొందబోతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మారం మండలం నర్సింగాపూర్‌కు చెందిన బద్ధం రాంరెడ్డి మూడున్నర ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయగా, మూడేళ్ల నాలుగు నెలలకే తొలి ఫలితం వచ్చింది. తోటంతా గెలలతో కళకళలాడుతున్నది. ఈ గెలలను కోయగా టన్నున్నర దిగుబడి (15 క్వింటాళ్లు) వచ్చింది. ఒక టన్నుకు (10 క్వింటాళ్లు) 22వేల ధర కాగా, టన్నున్నరకు 33 వేల ఆదాయం సమకూరింది. ఈ గెలలను తిరుమల ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేయడానికి వచ్చారు. ఆయిల్ పామ్ తోటలు సాగుచేసిన చుట్టుపకల గ్రామాల రైతులను ఆహ్వానించారు. రాంరెడ్డి తోటలోని గెలలను చూపించారు. ఆ రైతుల ఎదుటనే గెలలను అధికారులు కోయించారు. అకడే తూకం వేసి టన్నున్నర దిగుబడి వచ్చిందని ధ్రువీకరించారు.
కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన పత్తి శ్రీనివాస్‌రెడ్డి 2022 జనవరిలో రెండున్నర ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశాడు. ప్రస్తుతం తోట కోతకు రావడంతో సంతోషపడ్డాడు. శుక్రవారం గెలలను కటింగ్ చేయించాడు. రెండున్నర టన్నులు (25 క్వింటాళ్లు) దిగుబడి రాగా, టన్నుకు 18,500 చొప్పున 45 ఆదాయం వచ్చింది. గెలలను కోసిన తర్వాత కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి తరలివెళ్తున్న వాహనానికి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగుతో అనేకలాభాలు ఉన్నాయని, రైతులు ముందుకు రావాలని సూచించారు. అనంతరం అక్కడే ఆయిల్‌పామ్ మొక్క నాటి, శ్రీనివాస్ రెడ్డి దంపతులను శాలువాతో సత్కరించారు.
కేసీఆర్ ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమే.. పుట్ట మధూకర్
ముత్తారం, జూన్ 6 : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అడవిశ్రీరాంపూర్‌లో నాంసాని సమ్మయ్య అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్ తోటలో పంట తొలి దిగుబడిని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన దిగుబడి రాక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడం చూసి పంట సాగు విధానంలో మార్పు వస్తే బాగుంటుందని కేసీఆర్ గొప్పగా ఆలోచన చేశారని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారి ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు. దీనికి నిదర్శనమే అడవిశ్రీరాంపూర్‌కు చెందిన నాంసాని సమ్మయ్య వేసిన ఆయిల్‌పామ్ తోటలో మూడేళ్ల తర్వాత పంట చేతికి రావడమేనన్నారు.
ఇది 35 ఏండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుందని, దీనిని ప్రోత్సహించిన కేసీఆర్ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేశారో అర్థమవుతుందని చెప్పారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు మళ్లీ ఆకాశం వైపు చూసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరెంటు, నీళ్లు అందడం లేదని, కనీసం పెట్టుబడి సాయం కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేసిన పంటను అమ్ముకోవడానికి తంటాలు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతిపెద్ది కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు జకుల ముత్తయ్య, అత్తె చంద్రమౌళి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాడి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు నూనెకుమార్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్లు పోతుపెద్ది రమణారెడ్డి, గట్టు రమేశ్, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కురాకుల ఓదెలు, మాజీ సర్పంచ్ ఇల్లందుల అశోక్, బీఆర్ఎస్
నాయకులు నరెడ్ల రమేశ్, దాసరి రవీందర్, చిగురు విద్యాసాగర్, దాసరి దామోదర్, తిరుమల ఆయిల్‌పామ్ ప్రతినిధులు విజయ్, రంజిత్ పాల్గొన్నారు.
మమ్మల్ని ధనవంతులను చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాతో ఆయిల్‌పామ్ సాగు చేయించిండు. ఈ గొప్ప ఆలోచన ఆ సార్‌దే. రైతుల కోసం 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అంందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నడు. ఆయిల్‌పామ్ సాగు చేస్తే రైతులం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆలోచన చేసిండు. ముందుగా మా మండలంల ఆయిల్‌పామ్ సాగుకు అధికారులు వచ్చినప్పుడు కేసీఆర్ సార్‌పై నమ్మకంతో మూడేళ్ల కిందట రెండెకరాల్లో సాగు చేసిన. పంట గురించి తెలుసుకొని రెండేళ్ల కిందట మరో ఆరెకరాల్లో సాగు చేసిన. మొదట సాగుచేసిన రెండెకరాల్లో పంట కోతకు వచ్చింది. మొదట పంట పెట్టినప్పుడు టన్నుకు 12 వేలు ఉంటే అదే చాలనుకున్నం కానీ, ఇప్పుడు టన్నుకు 21 వేలు ఉంది. ఈ పంట పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఆయిల్‌పామ్ మూడేళ్లకే కోతకు వచ్చింది. ఇప్పుడే ఆదాయం మొదలైంది. నేను తొలుత రెండెకరాలు, ఆ తర్వాత ఎకరన్నర సాగు చేసిన. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తోట వేసిన. చెట్లు మంచి గెలలు వేసినయ్. తొలిసారి టన్నున్నర దిగుబడి వచ్చింది. 33 వేల ఆదాయం రావడం ఆనందంగా ఉంది.
– బద్ధం రాంరెడ్డి, రైతు, నర్సింగాపూర్ (ధర్మారం)
మాకు ఆదాయం రావడం మొదలైంది. 25 ఏండ్ల నుంచి 30 ఏండ్ల దాకా ఆదాయం ఉంటుంది. గ్రామ శివారుల నేను రెండున్నర ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేసిన. 2022 జనవరి 24న 150 మొకలు నాటిన. అవిప్పుడు ఏపుగా పెరిగి గెలలు కోతకు వచ్చినయ్. ఈరోజు సుమారు 2.50 టన్నుల గెలలు కోసి అశ్వరావుపేట ఆయిల్ ఫ్యాక్టరీకి తరలించినం. ఇప్పుడు టన్ను ధర 18 వేల పైనే ఉందని అధికారులు చెప్పిన్రు. అన్ని పంటల కంటే ఈ పంట చాలా బాగుంది. మంచి ఆదాయం వస్తుందనే నమ్మకం ఉంది. కేసీఆర్ గొప్ప ఆలోచనతో ఈ పంట పండించాలని చెప్పి చేయించిండు. మా ఆదాయానికి కేసీఆరే కారణం.
– పత్తి శ్రీనివాస్‌రెడ్డి, పెగడపల్లి (కాల్వశ్రీరాంపూర్ మండలం)