కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 19: వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుండగా, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో వివిధ రకాల పనులు చేస్తున్న కూలీలకు (NREGA Workers) మాత్రం, సంబంధిత యంత్రాంగం వేసవి నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కానరాకపోవడంతో, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండుటెండలో కూలీలు మలమల లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దంచికొడుతున్న ఎండల బారిన పడుతున్న వారంతా, ఒకరోజు వస్తే, మూడు రోజులు గైర్హాజరవుతున్నారని ఉపాధి సిబ్బందే పేర్కొంటుండటం గమనార్హం.
కరీంనగర్ జిల్లాలో 1,24,001 జాబ్ కార్డులుండగా, వీటి ద్వారా 2,32,569 మంది కూలీలుగా నమోదయ్యారు. నిత్యం 14 నుంచి 15.5 వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరిలో అత్యధిక మంది 50 ఏళ్ళు పైబడినవారే ఉంటున్నట్లు అధికా వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తగ్గిన నేపథ్యంలో, రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతున్నది. ఉపాధి హామీ చట్టం ప్రకారం వీరికి అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే కాగా, క్షేత్రస్థాయిలో నామ్కే వాస్తేగా ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన సమయంలో సేదదీరేందుకు అవసరమైన టెంట్లు, పనులు చేసేందుకు కావాల్సిన పనిముట్లు కూడా అందజేయాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకపోవడంతో తాగునీరు సైతం తమ ఇళ్ల నుండే తీసుకెళ్తున్నామని, ప్రదేశాల్లో అవసరమైన పనిముట్లు ఎవరివి వారే తెచ్చుకుంటున్నామని, చెట్ల నీడను ఆసనాలు చేసుకొని మధ్యాహ్నం భోజనాలు ముగిస్తున్నామని, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనానంతరం సేదతీరటం కూడా ఇబ్బందికరంగా మారుతుండగా, ఉపాధి పనులకు వెళ్తున్న అనేకమంది డిహైడ్రేషన్కు గురై వడదెబ్బ బారిన పడి, సకాలంలో వైద్య చికిత్స అందక, మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కూలీల సమస్యలు పక్కనపెట్టి అధికారులు, కేవలం పని దినాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని మండిపడుతున్నారు. ఈసారి ముందుగానే ఎండలు ముదరటంతో, ఈ ప్రభావం కూలీలపై అధికంగా పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూలీల నుంచి వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అందించే ప్రాథమిక చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూలీలు వాపోతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అయోడిన్, ప్రమాదాల బారిన పడి గాయాలైతే, శుభ్రం చేసేందుకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కనీస మందులు కూడా తమ వెంట ఉంచటం లేదని కూలీలు పేర్కొంటున్నారు. సమస్యలతో సావాసం చేస్తూ, ఉపాధి పనులకు వెళ్తున్నా, ఉపాధి చట్టం ప్రకారం వేసవిలో తమకు చెల్లించాల్సిన అదనపు భత్యం కూడా అటకెక్కించారని ధ్వజమెత్తుతున్నారు.
ఫిబ్రవరి, మార్చిలో 20 శాతం, ఏప్రిల్ లో 25 శాతం, మే నెలలో 30 శాతం వరకు కూలీలు చేసిన పనికి అదనపు భత్యంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ, కరవు భత్యం(టీఏ, డీఏ) ఖర్చు కింద గడ్డపారకు రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చేవారికి రూ.20 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే, గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ నిలిపివేయటంతో కూలీల బాధలు వర్ణనాతీతంగా మారాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉపాధి కూలీల కోసం అనేక సంక్షేమ చర్యలు తీసుకోగా, పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుత ప్రభుత్వం గత రెండు సీజన్ల నుంచి కూలీల పట్ల ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో, తాము ఇక్కట్ల పాలవుతున్నామని మండిపడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము వడ దెబ్బ బారిన పడి, అనుకోని ప్రమాదాలకు గురైతే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఉపాధి కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
వేసవిలో ఎండలు మండిపోతుండగా, పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీధర్ అన్నారు. వారికి అవసరమైన వైద్య సామగ్రిని సమీపంలోని వైద్య,ఆరోగ్య శాఖ ఆస్పత్రుల నుంచి తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.