కార్పొరేషన్, ఆగస్టు 6 : నగరంలోని ఎల్ఎండీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ, హస్నాపూర్ కాలనీవాసులకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనకి తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఐదు రోజుల క్రితం కరీంనగర్లోని 13వ డివిజన్లోని హస్నాపూర్, బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు పంపారు. డ్యాం సేఫ్టీ నిబంధనల ప్రకారం ఎల్ఎండీ డ్యాం కట్ట నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇంటి యజమానులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని అందులో స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయా కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇండ్లు కట్టుకొని 30 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నామని, ఇప్పుడు కూలగొడుతా అంటే ఎలా బతికేదని కన్నీటి పర్యంతమయ్యారు.
వీరిని గోడును చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. ‘మీకేం కాదు. నేనున్నా’నని భరోసానిచ్చారు. నీటిపారుదల శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముప్పై ఏళ్ల నుంచి ఉంటున్న కాలనీవాసులు ఇప్పుడు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. పేదల జోలికి రావొద్దని, హైదరాబాద్లోని హైడ్రాలాగా ఇకడ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు స్పందించాలని, పేదలకు భరోసా ఇవ్వాలని సూచించారు. కరీంనగర్ అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, ఇకడి ప్రాంత ప్రజలు ఎవరి జోలికి వెళ్లరని, వారి జోలికివస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నోటీసులు వెనకి తీసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏవీ రమణ, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, నక కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిలపు శ్రీనివాస్, దుర్శేడ్ మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, ధీరజ్, రజనీకాంత్, నాగరాజు, శ్రీకాంత్ ఉన్నారు.
ముప్పై ఏళ్లుగా ఇకడ నివసిస్తున్నం. మావి పట్టా భూములు. ప్రభుత్వం ఇచ్చినవి కావు. అప్పుడు ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన్రు. కరెంట్ ఇచ్చిన్రు. రోడ్లు వేసిన్రు. నల్ల బిల్లులు చెల్లిస్తున్నం. ఇంటి పన్నులు కడుతున్నం. ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారులు వచ్చి, డ్యాం సేఫ్టీ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు నోటీసు పంపించిన్రు. ఏం చేయాలో తెలియడం లేదు. రెకాడితే డొకాడని పరిస్థితిలో ఉన్నం. కాయకష్టం చేసుకొని ఇల్లు నిర్మించుకున్నం. వాటిని కూలగొడతా అంటే మా బతుకెట్ల? మేం ఎక్కడికిపోతం.