కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 14 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నోటీసులు పంపిస్తున్నదని, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, ఫార్ములా వన్, వంటి వివిధ పేర్లతో కేసులు పెడుతున్నదని, వీటిల్లో ఒక్కటి కూడా నిలిచేది లేదన్నారు. రైతు భరోసా ఈనెల 25న వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెబుతున్నారని, గతంలోనూ వివిధ డెడ్లైన్లు పెట్టి కాలయాపన చేశారని విమర్శించారు. కేసీఆర్‌ను రైతుబంధు మూడు పంటలకు ఇవ్వాలని, తాము అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడ కూడా రైతు భరోసా అందించడం లేదని ధ్వజమెత్తారు.
గతంలో ఇచ్చినా అది కూడా నాలుగెకరాల లోపు వారికి మాత్రమే అందిందని, అందులోనూ చాలా మందికి రాలేదని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పంటలకు రైతుభరోసా ఎగ్గొట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కౌలు రైతులకు, ఉపాధి కూలీలకు ఇస్తామన్న భరోసా ఏదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నదని దుయ్యబట్టారు.
యువతను ఆదుకుంటామని రాజీవ్ యువ వికాసం పేరుతో మోసం చేస్తున్నదని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని కాంగ్రెస్ నా యకులు మాట్లాడాలని హితవుపలికా రు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, చొ ప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.