Sunke Ravishankar | గంగాధర, జూలై 28 : చొప్పదండి నియోజకవర్గం లో రైతులు సాగుచేసిన పంటలు తాగునీరు అందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించి కాలేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. వరద కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నా రాస్తారోకో లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం పేరుతో పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో రైతులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
రైతులపై ప్రేముంటే కన్నెపల్లి పంపులను ప్రారంభించి, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, వరదకాల్వలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో వరదకాలువ జీవనదిలా ప్రవహించిదని, వేలాది ఎకరాలకు సాగునీరంది భూములు సస్యాశ్యామలంగా మారాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరందక పంటలకు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. వరద కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులు నీరు లేక భూములను వీలుగా వదిలేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ కుడి ఎడమ కాలువను పూర్తి చేస్తే చొప్పదండి నియోజకవర్గంలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతో చొప్పదండి నియోజకవర్గం ఎడారిగా మారుతోందని, రైతు సంక్షేమాన్ని కాపాడవలసిన నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లకు పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి నారాయణపూర్ రిజర్వాయర్, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి మూడు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావ్, నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, శ్రీ మల్ల మేఘరాజు, ద్యావ మధుసూదన్ రెడ్డి, తూము మల్లారెడ్డి, ఎండీ అబ్బాస్, పూడూరు మల్లేశం, దోమకొండ మల్లయ్య, తడిగొప్పుల రమేష్, గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు.