Odela | ఓదెల, అక్టోబర్ 6 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడితే, ఇప్పుడు పంటలు చేతికి అంది వస్తున్న తరుణంలో ఎడతెరిపిలేని వానలతో రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోత దశకు వచ్చేసరికి వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంట చేతికి అందకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. తుఫానుల కారణంగా వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి పంటలు కొన్ని పొట్ట దశలో ఉండగా, మరికొన్ని 10, 15 రోజులలో కోయనున్నారు. అలాగే పత్తి పంటలేము అదే పనిగా కురుస్తున్న వర్షాల వల్ల ఎదుగుదల లోపించి కాయలు కాసే దశలో ఆకులు పండు బారుతున్నాయి. చేలలో రోజుల తరబడి వరద నీరు కారణంగా మొక్కలు జాలుపట్టాయి. నీరు చేరి బూజు పట్టి నల్లరంగుకు మారి నాణ్యత లేకుండా పత్తి పంట పోతుంది.
వానలకు తోడు మబ్బులు పట్టిన వాతావరణం కారణంగా తెగులు పట్టి పీడిస్తున్నాయి. పత్తి పంటను ఎక్కువగా నల్లరేగడి భూముల్లో సాగు చేయడంతో వరుస వర్షాలతో చేలల్లో తేమ వదలడం లేదు. ఈ పరిస్థితి అంతా దిగుబడి పై ప్రభావం చూపనుంది. ఇలా వర్షాల కారణంగా వేసిన పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటల నష్టం పై ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.