Poshan Tracker | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 22 : అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్రం తీసుకొస్తున్న కొత్త మార్పులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కొద్దిమాసాలుగా కొత్తగా అమల్లోకి తెచ్చిన పోషణ్ ట్రాకర్ యాప్‌తో అంగన్వాడీ టీచర్లు, లబ్ధిదారులు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఈ యాప్‌తో లబ్ధిదారుల ముఖాన్ని సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి అప్లోడ్ చేసిన అనంతరమే వారికి పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ యాప్ ద్వారా ఫొటోలు అప్లోడ్ అవుతుండగా.. మిగతా వేళల్లో యాప్ ఫేస్ రీడింగ్ చేయటాన్ని ససేమిరా అంటున్నది.
వారి ఫొటోలు మాత్రమే అప్లోడ్..
పోషణ్ ట్రాకర్ యాప్‌తో ఫేస్ రీడింగ్ చేయని లబ్ధిదారులకు ఆ రోజు పౌష్టికాహారం పంపిణీ చేయటం లేదు. దీంతో గంటల తరబడి కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తోంది. అలాగే అంగన్వాడీ సిబ్బంది పదే పదే ఫొటోలు తీస్తూ, అప్లోడ్ చేస్తుండటం పట్ల విసుగు చెందుతుండగా, ఈ విధానంపై టీచర్లు, ఆయాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటల్లోపు వచ్చిన వారి ఫొటోలు మాత్రమే అప్లోడ్ అవుతుండగా, ఈ లోపు ఇండ్లలో తమ పనులు పూర్తి చేసుకోవటం కష్టసాధ్యమంటూ లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణ ప్రాంతాల్లో కూడా టీచర్లు, లబ్ధిదారులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహారం పక్కదారి పట్టడం దేవుడెరుగు.. నెట్వర్క్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక గంటల తరబడి కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఎండాకాలం ఆపై వడగాలులు, ఉక్కపోతతో చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు తట్టుకోలేకపోతున్నారని అంగన్వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు. మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థ కోసం నెట్వర్క్ అయినా మార్చాలని లేదా పోషణ్ ట్రాకర్ యాప్స్ నైనా అప్డేట్ చేయాలంటూ అంగన్వాడీ సిబ్బంది కోరుతున్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు