హుజూరాబాద్ టౌన్, జనవరి 11: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నీళ్లను ఇవ్వకుండా ఎస్సారెస్పీ కాలువ ద్వారా ఖమ్మం, సూర్యాపేటకు తరలిస్తున్నారని, తమకెందుకు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన మీద కోపం ఉంటే తన మీదనే తీర్చుకోవాలని, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. నీళ్లు ఇవ్వకపోతే రైతులను తీసుకువెళ్లి గేట్లు ఎత్తేస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా హుజూరాబాద్ గడ్డ నీళ్లు తాగిన బిడ్డగా భయపడేదిలేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజవర్గంలోని 106 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలోనైనా వంద శాతం రైతు రుణమాఫీ అయిందని నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శనివారం హుజూరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు 169 కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం హుజూరాబాద్ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేదిలేదన్నారు. కేసీఆర్ పాలనలో అందించే పథకాలను ఆపడం వల్ల పేద ప్రజలు ఎంతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పేరు నచ్చకపోతే, పేరు మార్చుకొని పథకాలను అందించాలని, పేదలకు ఉపయోగపడే మంచి పథకాలను ఆపొద్దని సూచించారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరానికి 15 వేలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
20 ఎకరాలు పండించే రైతుకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వరే కాకుండా పత్తి, మక్క మామిడి రైతులకు కూడా పెట్టుబడి సాయం కచ్చితంగా అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంట్, వ్యవసాయానికి నీళ్లు అందేవని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ హయాంలో ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. కల్వల ప్రాజెక్ట్ మరమ్మతు గురించి అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అడిగినట్టు గుర్తు చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారని, అభివృద్ధి పనులకోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. దళితబంధు రెండో విడుత ఇవ్వకుంటే ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రాణాలు పోయినా ప్రజలకు అన్యాయం జరుగుతే ఊరుకునేది లేదని, నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ అవసరాలున్నా తన వద్దకు రావాలని సూచించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ఇస్తానన్న తులం బంగారం ఇచ్చే వరకు, మహిళలు ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. సమావేశంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండాల్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మాజీ జడ్పీటీసీ బక్కారెడ్డి, హుజూరాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మలా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణీసురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ బండి రమేశ్, హుజూరాబాద్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.