ఇస్లామాబాద్, మార్చి 15 : పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం కాందహార్ మిలిటరీ స్థావరమే లక్ష్యంగా పాకిస్థాన్ వరుస దాడులకు పాల్పడింది. కాందహార్‌లో కీలకమైన మౌలిక సదుపాయాలను తమ దళాలు నిర్వీర్యం చేశాయని పాకిస్థాన్ భద్రతా యంత్రాంగం తెలిపింది. కాందహార్, తూర్పు అఫ్ఘానిస్థాన్‌పై పెద్ద ఎత్తున దాడులను జరిపామని, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన అత్యంత సున్నితమైన కేంద్రాలను నాశనం చేసినట్టు పేర్కొన్నది.
టీటీపీ కేంద్రాలు, తాలిబాన్ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగినట్టు తెలిపింది. రావల్పిండిపై అఫ్ఘాన్ డ్రోన్ దాడులను అడ్డుకున్న తర్వాత.. పాక్ ప్రతీకారంతో రెచ్చిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని వారాలుగా ఇరు దేశాల సరిహద్దు వెంబడి భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రాంతీయ భద్రతా సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.