నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి ఊపిరి పోయాల్సిన యంత్రాంగం.. అధికార వికేంద్రీకరణ పేరుతో గడిచిన మూడు నెలలుగా సాగుతున్న తాత్సారం.. ఇప్పుడు భవన యజమానులు, బిల్డర్లకు శాపంగా మారింది. ఫలితంగా ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో సొంత గూడు నిర్మించుకోవాలనుకునే సామాన్యుడి ఆశలకు అధికారుల నిర్లక్ష్యం సంకెళ్లు వేస్తున్నది. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నుంచి జోనల్ కమిషనర్ వరకు ఫైళ్లు తిరుగుతున్నాయే తప్ప.. అనుమతులు మాత్రం లభించడం లేదు. ఫైళ్లను పరిశీలించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగంలో సరిపడా సిబ్బంది లేకపోవడం, చిన్న పాటి సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ దరఖాస్తులను తిప్పి పంపిస్తుండడం, ఒక విభాగానికి, మరో విభాగానికి మధ్య సమన్వయం లేకపోవడంతో నెలల తరబడి ఫైళ్లు కదలడం లేదు. ‘బిల్డ్ నౌ’ ఉన్నా.. పేరుకే అన్నట్లుగా ఉంది. దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యం కారణంగా సామాన్యుడి సొంతింటి కల నెరవేరడం లేదు.
సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తేతెలంగాణ) : భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యం వల్ల సామాన్యుడు సొంతగూడు కోసం గోసపడుతున్నాడు. గడిచిన 15 రోజులుగా ఖైరతాబాద్, కూకట్పల్లి , ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్లకు అధికారుల మధ్య సఖ్యత లేమితో అనుమతుల జారీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కూకట్ పల్లి నుంచి కుత్బుల్లాపూర్ జోన్‌కు బదిలీ అయిన సుమారు 50 కీలక ఫైళ్లు ఇప్పటికీ ‘అడ్రస్’ లేవని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ కనుసైగలలో వందలాది ఫైళ్లు పెండింగ్ జాబితాలో కనిపిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా ఏసీపీ నుంచి సీపీ స్థాయి వరకు జరిగిన బదిలీల్లో చాలా మందికి డిజిటల్ కీ అందకపోవడం, మరోవైపు ఒక్కోక్కరికీ అదనపు బాధ్యతలతో అధికారులు సతమతమవుతుండడం కూడా ప్రభావం చూపుతున్నది. .వెరసి ప్రతి జోన్లో వందల సంఖ్యలో నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తులు నిలిచిపోయాయి. దీంతో సొంతింటి నిర్మాణ కలతో పాటు ప్రస్తుత శుభ గడియల వేళ ఓసీలు రాక బిల్డర్లు సైతం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. విజభన తెచ్చిన తంటాలపై నిర్మాణదారులు సర్కారు తీరును ప్రశ్నిస్తున్నారు.
బిల్డింగ్ కమిటీకి దిక్కులేదు
వాస్తవంగా ప్రతి వారానికి బిల్డింగ్ కమిటీ సమావేశం కావాలి. ఇందులో దరఖాస్తులను సమగ్రంగా కమిటీ సభ్యులు పరిశీలించి ఆమోదం తెలపాలి. ఐతే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి వారం బిల్డింగ్ కమిటీ సమావేశాలు రెగ్యూలర్‌గా జరుగుతుండగా…సీఎంసీ (సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్), ఎంఎంసీ (మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్)లలో తరచూ జరగాల్సిన బిల్డింగ్ కమిటీ సమావేశాలు ..గడిచిన 2 నెలలుగా బిల్డింగ్ కమిటీ సమావేశం జరిగిన దాఖలాలు లేవు. ఈరెండు కార్పొరేషన్ల పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులమధ్య సమన్వయ లోపంతో నిర్మాణదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నది.
అంతా అయోమయం
సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో ఫైళ్ల బదిలీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. పాత జోన్ అధికారులను అడిగితే ‘పంపించేశాం’ అంటారు.. కొత్త జోన్ వాళ్లేమో ‘ఇంకా రాలేదు’ అంటూ కాలయాపన చేస్తున్నారని కూకట్‌పల్లికి చెందిన నిర్మాణదారులు వాపోయారు. ఈ జోన్ల మార్పిడి సాకుతో అధికారులు సామాన్యుల సొంతింటి కలను కల్లలు చేస్తున్నారని మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించినా, ఏదో ఒక కొర్రీ పెడుతూ ‘డాక్యుమెంట్ కాల్ ఫర్’ పేరిట ఫైళ్లను వెనకి పంపుతుండటం విమర్శలకు తావిస్తున్నది.
అధికారుల్లో అవగాహన లోపమో లేక కావాలనే చేస్తున్న జాప్యమో తెలియక దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా సిటీజన్ చార్టర్ ప్రకారం భవన నిర్మాణ అనుమతులు 21 పని రోజుల్లో మంజూరు చేయాలి. పత్రాలు అసంపూర్ణంగా ఉంటే అదే గడువులో తిరసరించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల దరఖాస్తుదారులు అయోమయంలో పడుతున్నారు. కొన్ని జోన్లలో పూర్తి పత్రాలు సమర్పించినా..తిరిగి పలు కారణాలను చూపుతూ ఫైళ్లను తిప్పి పంపుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో పారదర్శకత, వేగం తీసుకురావాలంటే సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని దరఖాస్తుదారులు కోరుతున్నారు.