Karimnagar | కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 26 : కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులను సోమవారం ఉదయం కలెక్టర్‌కు అందించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగర మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంపై బీఆర్ఎస్ సరికొత్త వూహ్యాన్ని సిద్ధం చేసింది. ఆయనపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను కలుపుకొని అవిశ్వాసాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ముఖ్యంగా ఈనెల 28తో పాలకవర్గ పదవీకాలం ముగిస్తున్నా ఉన్న రెండు రోజుల్లోనూ మేయర్‌పై కార్పొరేటర్లు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపించేందుకు చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే అవిశ్వాసానికి సంబంధించి కార్పొరేటర్ల సంతకాలు చేపట్టగా ఇప్పటికే 31 నుంచి 35 మంది మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం అధికారులకు నోటీసులు అందించే సమయానికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది.
మేయర్ బీజేపీలో చేరే సమయంలోనూ ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు చేరుతారని ప్రచారం సాగినా, చివరకు ఇద్దరు మాత్రమే చేరారు. దీంతో మేయర్ తీరుపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లందరూ రెండు రోజులే గడువు ఉన్నా అవిశ్వాస నోటీసులు ఇవ్వాలని నిర్ణయించి ఇప్పటికే సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, కరీంనగర్ నగరపాలక సంస్థలో పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్న సమయంలో చేపడుతున్న ఈ అవిశ్వాసంపై ఎలాంటి చర్చ సాగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.