రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలకు ఎంపికైన పైలట్ గ్రామాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్క రైతు భరోసా మినహా ఏ పథకంలోనూ స్పష్టత లేకపోవడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు దరఖాస్తు చేసుకున్న కొద్ది మందిలోనూ అర్హులకు చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు, కొన్ని గ్రామాల్లో ఉత్త కాగితాలు చేతిలో పెట్టి ప్రొసీడింగ్లని చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నది. కొన్ని గ్రామాల్లో పలు పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు కూడా చేతికిరానట్టు తెలుస్తున్నది. కాగా, తమ పరిస్థితి ఏంటని, తమకెప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తారని మిగతా గ్రామాల ప్రజానీకం ప్రశ్నిస్తున్నది.
కరీంనగర్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల ప్రారంభంతోపాటు కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. దీంతో దరఖాస్తుదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈనెల 26 నుంచి పథకాలు అమలు చేస్తామని, మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలోనే ఇస్తామంటూ మెలిక పెట్టింది. గణతంత్ర దినోత్సవం రోజున లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందిస్తామని, వచ్చే నెల నుంచి మిగతా గ్రామాల్లో అమలు చేస్తామని హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ప్రకటించారు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, రాత్రికి రాత్రే ఆ గ్రామంలోని లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు తయారు చేశారు.
మాది నిరుపేద కుటుంబం. గీత కార్మికుడిగా పని చేస్తూనే నేను, నా భార్య లత ఇద్దరం ఉపాధి పనులకు వెళ్తం. అయితే, మేము పని చేస్తే మా మస్టర్లు మా తండ్రి మొగిలి బుక్కుల వేసిన్రు. గిదేంది అంటే ఎట్లయితేంది.. మీకు డబ్బులు పడుతున్నయి కదా అన్నరు. గిప్పుడేమో మా పేరు మీద 20 రోజుల పని దినాలు లేవంటున్నరు. మా తండ్రి పేరు మీద 9 గుంటల భూమి ఉంది. దీంతో మా ఇంట్లో ఎవరికీ ఆత్మీయ భరోసా రాలే. రేషన్ కార్డులు వేర్వేరు ఉన్నా.. నేను, నా భార్య పని చేసినా.. మా తండ్రి పేర మస్టర్లు వేసి మాకు అన్యాయం చేసిన్రు. గిట్ల చేసిన్రు అంటే ఈ పథకం వస్తదని అనుకున్నమా? అని అంటున్నరు. నిరుపేదలమైన మాకు న్యాయం చేయాలె.
మా గ్రామానికి చెందిన పశువులను కాస్తూ బతుకుతున్నం. మాకు ఇల్లు లేదు. గ్రామసభలో ఇల్లు మంజూరైనట్టు అప్పుడు అధికారులు చెప్పడంతో సంబురపడ్డం.. గ్రామంలో అధికారులు వచ్చి ప్రొసీడింగ్స్ ఇస్తరని గ్రామపంచాయతీ దగ్గరకు ఇద్దరం పోయినం. కానీ, మాకు ఇల్లు రాలేదని చెప్పిన్రు. మా సంబురం మీద ఉడుకునీళ్లు చల్లినట్లయింది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలె.
నాకు గ్రామంలో 2 ఎకరాల 27 గుంటల సాగు భూమి ఉన్నది. ఇందులో ఏటా వరి పండిస్తున్న. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ప్రతీసారి నాకు రైతు బంధు వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా రైతు భరోసా రాలే. ఇటీవల ఏఈవోలు కూడా సర్వే చేసిన్రు. కుల గణనలో కూడా సర్వే చేస్తే కూడా రాయించిన. ఇక రాయించడానికే సరిపోతుంది. కానీ, ఫోన్లో టింగ్ లేదు.. టంగ్ లేదు. ఇంక మా ఊరినే పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి అధికారులంతా అర్బాటం చేసిన్రు. రైతు భరోసా పైసలు ఇప్పటివరకు బ్యాంకులో జమకాలే.
మాది కొత్తపల్లె. దళిత కుటుంబం. మాకు గుంట భూమి లేదు. నా భర్త పేరు లంక పెద్దబాపు. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. బిడ్డలకు పెండ్లయింది. నా పెనిమిటికి దుబాయ్‌లో ఉండంగనే ఆక్సిడెంట్ అయి కాలు దెబ్బతిన్నది. దాంతోటి ఇంటికి వచ్చేసిండు. పదేండ్ల సంది ఇక్కడే ఉంటున్నడు. నా పనిచేసుడు తిప్పలైతదని పనికి రాడు. నాకు జాబ్ కార్డు ఉంది. అడవి పని (ఉపాధి హామీ పథకం)కి పోతున్న. యాడాదికి వంద రోజులు పనికి పోత. రైతు కూలీ కింద యాడాదికి 12 వేలు ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్న. నిన్న మా ఊళ్లె కొందరికే ఇత్తమని కాయితం వచ్చింది. అ లిస్టుల నా పేరు లేదు. గుంట భూమి లేకున్నా ఇయ్యలె. సార్లను అడిగితే నా పేరు రాలేదు అన్నరు. ఎందుకు రాలేదు అంటే మాకు తెల్వదంటున్నరు. కాంగ్రెస్ సర్కార్ ముచ్చట గిట్లనే ఉంటదా సార్. మా లాంటోళ్లకు అన్యాయం చేస్తున్రు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రాత్రికి రాత్రే ఎంపిక చేసిన గ్రామాలు, అక్కడి లబ్ధిదారుల జాబితాలను అందించే ప్రయత్నం చేశారు. అయితే, కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్‌లు ఇప్పటి వరకు అందనట్టు తెలుస్తున్నది. మచ్చుకు జమ్మికుంట మండలం గండ్రపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 367 మంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు 180 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మంగళవారం వరకు కేవలం ఐదుగురికి మాత్రమే ప్రొసీడింగ్‌లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అదే విధంగా హుజూరాబాద్ మండలం ధర్మరాజ్పల్లి, సైదాపూర్ మండలం వెన్కేపల్లిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ధర్మరాజ్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 406 దరఖాస్తులు అందగా 212 మందిని ఎంపిక చేసిన అధికారులు 25 మందికి మాత్రమే ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో 509 దరఖాస్తులు రాగా 307 మందిని ఎంపికచేసి 159 మందికి మాత్రమే ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. రేషన్ కార్డులు మాత్రం కుప్పలు తెప్పలుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో జిరాక్స్ పత్రాలపై సంతకాలు చేయకుండానే ప్రొసీడింగ్‌లు ఇచ్చినట్టు సమాచారం. తమకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రొసీడింగ్‌లపై నమ్మకం కలుగడం లేదని కొందరు లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
నాకు పెళ్లయిన తర్వాత మా అత్త, మామయ్య అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నం. నా భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిండు. నేను వ్యవసాయం చేసుకుంట ఇక్కడే ఉంటున్న. మాకు ఉన్న ఇల్లు అందరం ఉండడానికి సరిపోవడం లేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. కులగుణన సర్వేలో కూడా మాకు ఇల్లు లేదని రాయించిన. ఇటీవల గ్రామసభలో మళ్లీ దరఖాస్తు చేసుకున్న. మా ఊళ్లె దరఖాస్తు చేసుకున్నవాళ్లందరికీ పథకాలు ఇస్తామని చెప్పి, నా దరఖాస్తును రద్దు చేశారు. నాకు జాగ ఉంది. ఇల్లు కట్టుకుందామని ఆశపడితే ఆవిరి చేసిన్రు.
నాది సర్వాపూర్ గ్రామ పరిధిలోని కొత్తపల్లె. మాది దళిత కుటుంబం. నిరుపేదలం. నాకు భార్య జమున, ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క కొడుకు. పెద్ద బిడ్డ పెండ్లి చేసినం. చిన్న బిడ్డ 8వ తరగతి, కొడుకు రెండో తరగతి చదువుతున్నరు. మాకు సొంతిల్లు కూడా లేదు. బతుకుదెరువు కోసం నేను, నా భార్య ఇద్దరం కూలీ పనిచేసుకొని బతుకుతున్నం. ఏడాదిలో చాలా రోజుల పాటు ఉపాధిహామీ పనికి సైతం పోతం. పని లేని రోజుల్లో ఆటో నడుపుత. అయితే, సర్కార్ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఆటో నడుత్తలేదు. విధి లేక ఆటోను అమ్మిన. రేవంత్‌రెడ్డి సార్ రైతు కూలీలకు కూడా యాడాదికి రూ.12 వేలు ఇత్తం అంటే నమ్మినం. తీరా చూస్తే ‘మీకు ఏడు గుంటల భూమి ఉంది. రైతు భరోసా రూ.వెయ్యి వచ్చింది. అందుకే మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు’ అని సార్లు చెప్పిన్రు. ఆ భూమి నాకు వారసత్వంగా వచ్చింది. ఏడు గుంటల భూమితోనే ఎవుసం చేసి కుటుంబాన్ని ఎల్లదీయత్తదా..? ఏందో నాకు అర్థమైత లేదు. మాకే కాదు సార్.. మా అన్న కొత్తూరి నర్సయ్య, ఆయన భార్య కూడా అడవి పనికి పోయే బతుకుతరు. వాళ్లకు కూడా ఏడుగుంటల పొలం ఉందని ఆత్మీయ భరోసా రాలేదు. ఇది ఎంత వరకు న్యాయం? సర్కార్ చేసేది సరైన పని కాదు సార్. మాలాంటి వాళ్ల కడుపు కొడుతుంది. ఎకరం లోపు భూమి ఉండి ఎవరైతే అడవి పనికి పోతరో వారికి ఆత్మీయ భరోసా పథకం ఇవ్వాలి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు ఆరు నెలలకు 6 వేల చొప్పున ఏడాదికి 12 వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, పథకానికి లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం అనేక కొర్రీలు పెట్టిందని క్షేత్రస్థాయిలో అర్హులైన కూలీలు వాపోతున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఆ కుటుంబానికి ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతే కాకుండా, ఏడాదికి 20 రోజులు ఉపాధిహామీ కూలీకి వెళ్లి ఉండాలి. దీంతో అనేక నిరుపేద కుటుంబాలు అర్హత కోల్పోవాల్సి వస్తోంది. ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో పరిశీలిస్తే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఎంపిక చేసినవి చిన్న గ్రామాలే అయినా ఒక్కో గ్రామంలో 200 నుంచి 300 కూలీలకు ఈజీఎస్ జాబ్ కార్డులు ఉన్నాయి. కానీ, అధికారులు మాత్రం ఏ గ్రామంలో రెండంకెలు దాటిన పరిస్థితి కనిపించడం లేదు. గంగాధర మండలం కురిక్యాలలో 282 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇందులో 20 రోజులు కూలీకి వెళ్లిన వారు 160 మంది వరకు ఉన్నారు.
కానీ, దరఖాస్తులు మాత్రం 41 మాత్రమే వచ్చాయని, అందులో కేవలం 25 మందిని మాత్రమే ఎంపిక చేశారు. చిగురుమామిడి మండలం గునుకులపల్లిలో అయితే, కేవలం ఐదుగురిని మాత్రమే ఎంపిక చేశారు. చొప్పదండి, కరీంనగర్ రూరల్, శంకరపట్నం, జమ్మికుంట, తిమ్మాపూర్, తదితర మండలాల్లోని పైలట్ గ్రామాల్లో 250 మందికి పైగా కూలీలు ఉన్నా కేవలం 20 నుంచి 35 మంది వరకే ఎంపిక చేశారు. రైతు బంధుతో పోల్చుకుంటే రైతు భరోసా కింద పైలెట్ గ్రామాల్లోని రైతులందరి ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్లు తెలుస్తుండగా, మిగతా పథకాల విషయంలో మాత్రం లబ్ధిదారుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే గతంలో ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు ఆయా పథకాల జాబితాలో కనిపించడం లేదని కొందరు అధికారులను నిలదీస్తున్నారు. ఇలాంటి వారు మళ్లీ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటే తమకు ఎప్పుడు ఇస్తారని, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని ఆయా పైలెట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను గొప్పగా ప్రారంభిస్తుందని ఆశించిన జనానికి నిరాశే మిగులుతున్నది. నాలుగు పథకాల అమలు విషయంలో ఒకే సారి అన్ని గ్రామాల్లో ప్రయోజనం చేకూరుతుందని భావించిన ప్రజలు ఈ పథకాలిప్పుడు పైలెట్ గ్రామాలకే పరిమితం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉందని, ఫిబ్రవరి మొదటి వారంలో మిగతా గ్రామాల లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 15 గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల కోసం 3813 మంది దరఖాస్తు చేసుకోగా 2316 మందిని అర్హులుగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు 2247 మంది ఉండగా ఇందులో 20 రోజులు పనికి వెళ్లినవారు 1276 మంది ఉన్నారు. అయితే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 440 మందిని మాత్రమే ఎంపిక చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం 1536 మంది దరఖాస్తు చేసుకోగా3 1152 మందిని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 301 ఎకరాలు మాత్రమే రైతు భరోసాకు అర్హత లేని భూములుగా గుర్తించారు.
జగిత్యాల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపి చేసిన 20 గ్రామాల్లో 734 మందికి మాత్రమే కొత్త రేషన్‌కార్డులను జారీ చేసింది. 1620 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. 8325 మందికి రైతు భరోసా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆత్మీయ భరోసా కింద కేవలం 673 మందిని మాత్రమే ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల నుంచి పైలెట్ ప్రాజెక్టుగా 13 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 3601 దరఖాస్తులు రాగా3, ఇందులో 2416 అర్హత ఉన్నవిగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య 2922 మంది ఉండగా, ఇందులో 20 రోజులు పనికి వెళ్లిన వారు 1945 ఉన్నారు. అయితే , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 637 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం 1025 మంది దరఖాస్తు చేసుకోగా 813 మందిని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో కేవలం 36.04 ఎకరాలు మాత్రమే రైతుభరోసాకు అర్హత లేని భూములుగా గుర్తించారుర.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో రేషన్ కార్డుల కోసం 569 మంది దరఖాస్తు చేసుకోగా 250 మందిని ఎంపిక చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 4172 మంది దరఖాస్తు చేసుకోగా 2022 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 890 మంది దరఖాస్తు చేసుకోగా 874 మందిని అర్హులుగా గుర్తించారు.
మేం రోజూ వ్యవసాయ పనులు చేసుకుంట బతుకుతున్నం. నాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. మాకు సొంతిల్లు లేదు. ఇల్లు కట్టుకోడానికి స్థలం ఉంది. 8 ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నం. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకోడానికి ఆఫీసర్లకు దరఖాస్తు పెట్టుకున్న. నా పేరు అర్హుల జాబితాలో లేదన్నరు. అధికారులు మన్నించి ఇల్లు మంజూరు చేయాలె.
మేం రోజూ వ్యవసాయ పనులు చేసుకుంట బతుకుతున్నం. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. మాకు సొంత ఇల్లు లేదు. ఇప్పటి వరకు ప్రజాపాలనల రెండు సార్లు దరఖాస్తు పెట్టుకున్న. ఇల్లు కట్టుకోడానికి స్థలం ఉంది. కానీ, అర్హుల జాబితాలో నా పేరు లేదు. అధికారులు మన్నించి ఇప్పటికైనా ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్న.
నాకు మా గ్రామ శివారుల 1.11 ఎకరాల భూమి ఉన్నది. మా గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తమని చెప్పిన్రు. నాకు ఇప్పటి వరకు రైతు భరోసా డ బ్బులు రా లే. పైలట్ గ్రామంలో అందరికీ ఇస్తమని గొప్ప లు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. బీఆర్ఎస్ హ యాంలో రైతులందరికీ ఒకేసారి రైతుబంధు డబ్బులు వచ్చేవి. రైతు భరోసా పై కాంగ్రెస్ మాటలు నమ్మేటట్లు లేదు.