Pregnant Woman Suffering | తిమ్మాపూర్, జనవరి 23: పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలు తిరిగే కుటుంబాలు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో ఎన్నో ఉన్నాయి. వారు వారి కుటుంబాలతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో పిల్లలు పుడితే, వారి పేరు నమోదు జాప్యం కావడంతో ఆధార్ లేక పిల్లలు పెద్దయ్యాక సతమతమవుతున్నారు. ప్రస్తుతం బేడ బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన 23 ఏండ్ల ఊబిది రేఖ గర్భవతి. వారి కుటుంబం ఆమె చిన్ననాటి నుంచే ఇతర రాష్ట్రాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది.
ఈ క్రమంలో ఆమె పుట్టిన సమయంలో అధికారికంగా పేరు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో ఆమె ఆధార్ కార్డు తీసుకోవడంలో జాప్యం జరిగింది. అయితే ఆమె గర్భం ధరించిన నుండి ఆసుపత్రిలో చికిత్స కోసం వెళితే ఆధార్ కార్డు లేక ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం నిండు గర్భిణీ కావడంతో కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఆధార్ కార్డు ఉంటేనే ప్రసూతి చేస్తామని డాక్టర్లు చెబుతున్నారని, తనకు ఆధార్ కార్డు లేదని ఆమె వాపోతోంది. ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డెలివరీ చేయించుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని, అధికారులు తనపై కనికరం చూపించి ఆధార్ కార్డు ఇప్పించి, తనకు గుర్తింపునివ్వాలని కోరుతోంది. తనకు ఆధార్ కార్డు లేకపోతే అమ్మను కాలేనా..? అని వాపోతోంది.