SIR Mapping | రామగిరి, సెప్టెంబర్ 11 : బేగంపేట గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉన్నప్పటికీ మ్యాపింగ్ జరగని పలువురు ఓటర్లకు నోటీసులు జారీ కావడంతో సంబంధిత ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎల్వోల స్థాయిలో జరిగిన పొరపాట్లు, సిబ్బంది మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
శుక్రవారం నిర్వహించనున్న గ్రామ సభకు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరయ్యారు. కాగా, ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న పలు అంశాలు వారి దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా 2002 ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ మ్యాపింగ్ చేయకపోవడంతో నోటీసులు అందినట్లు పలువురు పేర్కొన్నారు. బేగంపేట గ్రామంలో సిబ్బంది సమన్వయలోపం కారణంగా సుమారు 850 మంది ఓటర్లకు నోటీసులు అందినట్లు సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము గతంలోనే ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నప్పటికీ, మ్యాపింగ్ ప్రక్రియలో తమ వివరాలు ఎందుకు నమోదు కాలేదనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.